Delhi Acid Attack: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన సంచలనం సృష్టించింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిపై పట్టపగలే యాసిడ్ దాడి (Delhi Acid Attack) జరిగింది. ఈ ఘటనలో యువతి ముఖం కాపాడుకోగలిగినా చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడి ఆదివారం (నిన్న) ఉదయం 10 గంటల ప్రాంతంలో కళాశాల క్యాంపస్‌కు కొద్ది దూరంలోనే చోటుచేసుకుంది. బాధితురాలు నడుచుకుంటూ వెళుతుండగా జితేందర్ అనే వ్యక్తి తన స్నేహితులు ఇషాన్, ఆర్మాన్ లతో కలిసి బైక్‌పై వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. జితేందర్ యాసిడ్ పోయగానే.. ముగ్గురూ అక్కడి నుండి పారిపోయారు.
యాసిడ్ దాడిలో గాయపడిన యువతిని వెంటనే రామ్ మనోహర్ లోహియా (RML) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. యాసిడ్ దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు జితేందర్, బాధితురాలు ఇద్దరూ ఒకరికొకరు తెలిసినవారని, ఇద్దరూ ముకుందపూర్ నివాసితులని పోలీసులు తెలిపారు.
Also Read: Australia: టీమిండియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్.. ఆసీస్‌కు ఎదురుదెబ్బ!
యువతి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. జితేందర్ చాలా కాలంగా ఆమెను వేధిస్తున్నాడు. దాదాపు నెల రోజుల క్రితం ఈ వేధింపుల విషయమై వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే జితేందర్ పగ పెంచుకుని తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రధాన నిందితుడు జితేందర్ పరారీలో ఉన్నాడని, అతనితో పాటు ఇషాన్, ఆర్మాన్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దారుణమైన యాసిడ్ దాడి సంఘటన దేశ రాజధానిలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలను పెంచింది. నిందితులను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలు విద్యార్థి సంఘాలు, మహిళా హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
