ఐపీఎల్-2022 సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ ఓటమిని మూటగట్టుకుంది. కొత్త సారథి రవీంద్ర జడేజా కెప్టెన్సీలో దారుణ ప్రదర్శనతో విమర్శల పాలవుతోంది. అయితే అసలే వరుస ఓటముల బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి మరో భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఐపీఎల్ 2022వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు మిస్ అయిన స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్.. ఆ గాయం మళ్ళి తిరగబెట్టడంతో ఈ సీజన్ మొత్తానికి దూరమైనట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2022లో సీఎస్‌కే 14 కోట్లు ఖర్చు చేసి దీపక్ చహర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో అతడు తొడ కండరాల గాయానికి గురికావడంతో ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని తొలుత వార్తలు వచ్చాయి. కానీ నేషనల్ క్రికెట్ అకాడమీలో చహర్‌కు సర్జరీ అవసరం లేదని వైద్యులు చెప్పడంతో అతను ఫిట్ నెస్ సాదించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే తాజాగా దీపక్ కు గాయం మళ్ళి తిరగబెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని గాయం తీవ్రత దృష్ట్యా అతను దాదాపు రెండు వారాల పాటు క్రికెట్ కు దూరం కానున్నట్లు సమాచారం.
ఇక గతేడాది ఐపీఎల్ లో 15 మ్యాచ్‌లాడిన దీపక్ చహర్ 14 వికెట్లు పడగొట్టి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టైటిల్ విజేతగా నిలవడంతో ముఖ్య పాత్ర పోషించాడు. ఇక ప్రస్తుత సీజన్‌లో సీఎస్‌కే ఓడిన నాలుగు మ్యాచ్‌ల్లో కూడా దీపక్ చాహర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇదిలా ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్ ఏప్రిల్ 12న తమ ఐదో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. సీజన్ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన సీఎస్‌కే.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.