Site icon HashtagU Telugu

Jagan Govt: ‘అభివృద్ధి వికేంద్రీకరణ’ అనేదే ‘జగన్ ప్రభుత్వ’ విధానం – ‘విజయసాయిరెడ్డి’

Vijay Sai Reddy Jagan

Vijay Sai Reddy Jagan

వికేంద్రీకరణే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానమని, రాజధాని అంశంలో నిర్ణయాధికారం, బాధ్యత శాసన వ్యవస్థ దేనని సీఎం జగన్ విస్పష్టంగా ప్రకటించారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. అమరావతికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడుతూనే అభివృద్ధి ఫలాలను రాష్ట్రమంతటా విస్తరిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, ఎక్కడా అసమానతలు తలెత్తకూడదన్నదే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. మూడు రాజధానుల అభివృద్ధి కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన పచ్చ బ్యాచ్ గుండెల్లో గునపంలా దిగిందని అన్నారు.

టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి, చేసిన ఖర్చంతా వృధా అయ్యిందని, ఒకే రాజధాని నినాదం ఇక అంతులేని వ్యథగా మిగిలిపోయినట్టేనని విజయసాయి రెడ్డి చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మూడు రాజధానులు కావాలంటే మళ్ళీ ప్రజాతీర్పు కోరాలన్న చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని, ఈ వ్యాఖ్యలు అతని అహంకారానికి, అయోమయానికి అద్దం పడుతున్నాయని అన్నారు. గజిబిజిగా తయారైన ఆయన మైండ్ కు అందరూ పిచ్చోళ్ళలా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. ముందే చేతులెత్తేసి గుక్కపెట్టి ఏడిస్తే సానుభూతి రాదని వెల్లడించారు.

శాసనాలు చేసే అధికారం చట్టసభలకే ఉంటుందని ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదని అన్నారు. తమ తమ పరిధుల్లో ఆయా వ్యవస్థలు వ్యవహరించాల్సి ఉంటుందని… రాజ్యాంగానికి లోబడే అన్ని వ్యవస్థలూ పనిచేయాలని అన్నారు. న్యాయ వ్యవస్థ మీద పూర్తి గౌరవం, విశ్వాసం వైసీపీకి ఉన్నాయని ఇందులో సందేహం లేదని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించినంత మాత్రాన కోర్టులను గౌరవించనట్లు కాదని, ప్రజాభిప్రాయమే సుప్రీం అన్నంత మాత్రాన వేరే వ్యవస్థను అగౌరవ పరిచినట్లు కాదని చెప్పారు. సుప్రీం తీర్పుతో ఏకీభవించినంత మాత్రాన హైకోర్టు తీర్పుతో విబేధించినట్లు కాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అంతిమ న్యాయనిర్ణేతలని అన్నారు.

కౌల్సిల్ లో తాళిబొట్లు ప్రదర్శించి సందేశమివ్వాలనుకోవడమేంటని, స్త్రీ తన తాళిబొట్టును ఎంత పవిత్రంగా భావిస్తుందో తెలిసి కూడా ఇలా ప్రవర్తించడమేంటని టిడిపి సబ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు.  ఈ ప్రదర్శన ద్వారా చంద్రబాబు మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచాడని…  ల్అధికారం పోయినా చంద్రబాబుకు అహంకారం పోలేదని, ఓట్లు వేయలేదన్న కక్షతో తాళిబొట్ల డ్రామాతో మహిళలను అవమానపరచడం సరికాదని అన్నారు. నీతిలేని నాయకుడు ఎవరంటే భవిష్యత్తు తరాలు చంద్రబాబునే చూపిస్తాయని, అధికార దుర్వినియోగంతో ఆయన చేసిన అరాచకాలు దేశంలో ఎవరూ చేసి ఉండరని అన్నారు. చివరకు ఏకైక పుత్ర రత్నాన్ని కూడా మహిళల పట్ల గౌరవం లేని కుసంస్కారిని చేశాడని విజయసాయి రెడ్డి విమర్శించారు.

దక్షిణాది రాష్ట్రాల శాసనసభల్లో అత్యధిక మహిళా ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రధమస్థానమని, ఈ విషయాన్ని కేంద్రం పార్లమెంటులో వెల్లడించిందని… ఇది రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన వారిలో 8% మంది మహిళలు ఉన్నారని గుర్తుచేశారు. సీఎం జగన్ మహిళలకు అన్నింటా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. దొంగ తానే అయినా కెలికి మరీ లిక్కర్ బ్రాండ్ల లోగుట్టు చంద్రబాబు బయటపెట్టించుకున్నాడని, తీరా బయటపడిపోయాక ఇప్పుడు ఏమి చేయాలో ఆయనకు దిక్కుతోచడం లేదని అన్నారు. చంద్రబాబు, భజన మీడియా కాలం చెల్లిన మైండ్ సెట్ తో అక్కడే గిరికీలు కొడుతున్నారని. 2004లో ‘అలిపిరి దాడి పై ఆశ పెట్టుకుంటే భంగపాటు ఎదురయ్యిందని,  2019 లోనూ పెట్టుకున్న ఆశలన్నీ ఆడియాశలయ్యాయని అన్నారు. బ్యాంకులకు భారీగా రుణాలు ఎగ్గొట్టిన ఇండ్-భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పై సీబీఐ విచారణ వేగవంతం చేయాలని,  విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆ సంస్థ డైరెక్టర్లు, ప్రతినిధులు విదేశాలకు పారిపోకుండా నిషేధం విధించాలని సీబీఐ డైరెక్టర్ కు విజయసాయిరెడ్డి లేఖ వ్రాసారు. బ్యాంకులను మోసగించి సంస్థ తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా వసూలు చేయాలని కోరారు. రూ 1000 కోట్లకు పైగా రుణాలు ఎగవేత జరిగిందని అన్నారు.

దేశంలోనే అతిపెద్ద ఏసీ తయారీ యూనిట్ ను జపాన్ కు చెందిన శీతలీకరణ ఉత్పత్తుల తయారీ సంస్థ డైకిన్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తోందని… శ్రీసిటీలో 100 ఎకరాల్లో ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు డైకిన్ ఇండియా సంస్థ ప్రకటించిందని… ఇందుకోసం తొలిదశలో రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొందని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.

Exit mobile version