Site icon HashtagU Telugu

Michael Letko: మరో వైరస్ కు వేదికైన చైనా.. ఇది కరోనాకంటే డేంజరంట..!

Corona

Corona

Michael Letko: ఇప్పటికే ప్రపంచాన్ని పలుమార్లు వణికించిన కరోనా వైరస్ కుటుంబానికి చెందిన మరో ప్రమాదకర వైరస్ మానవాళిపై ముప్పుగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మెర్స్కోవ్ (MERS-CoV) అనే ప్రాణాంతక మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వైరస్‌కు దగ్గర సంబంధం ఉన్న హెచ్‌కేయూ5 (HKU5) అనే గబ్బిలాల వైరస్ కేవలం చిన్న జన్యుపరమైన మార్పుతో (మ్యూటేషన్) మానవ కణాలలోకి ప్రవేశించి, భవిష్యత్తులో మరో మహమ్మారికి దారితీయవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఈ వైరస్‌లను మొదటగా చైనాలో గబ్బిలాల్లో గుర్తించారు. ఇవి జంతువుల నుండి మానవులకు వ్యాపించే లక్షణాలు (spillover potential) కలిగి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ నేతృత్వంలో, కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నార్త్ కరోలినా విశ్వవిద్యాలయాల సహకారంతో ఈ పరిశోధనను నిర్వహించారు. ఇది ప్రముఖ శాస్త్రీయ పత్రిక ‘నేచర్ కమ్యూనికేషన్స్’లో ప్రచురితమైంది.

ఈ అధ్యయనం మెర్బెకోవైరస్‌లపై దృష్టి సారించింది — ఇవి కరోనా వైరస్ కుటుంబానికి చెందుతాయి. మానవులపై సాపేక్షంగా తక్కువ ప్రభావం చూపే ఇతర మెర్బెకోవైరస్‌లతో పోలిస్తే, హెచ్‌కేయూ5 మాత్రం మానవ కణాలలోకి ప్రవేశించే అధిక సామర్థ్యాన్ని చూపుతోందని పరిశోధన తెలిపింది. ముఖ్యంగా, హెచ్‌కేయూ5 వైరస్‌లు ACE2 గ్రాహకాలను టార్గెట్ చేస్తున్నాయన్న విషయాన్ని ప్రయోగపూర్వకంగా రుజువు చేశారు. ఇదే గ్రాహకాన్ని SARS-CoV-2 కూడా ఉపయోగించడం గమనార్హం.

New Scheme : ఏపీలో మరో కొత్త పథకం..ఎవరికోసం అంటే !!

హెచ్‌కేయూ5 వైరస్ ప్రస్తుతం గబ్బిలాల ACE2 గ్రాహకాలను సమర్థంగా బంధిస్తున్నప్పటికీ, మానవ కణాలను పూర్తిగా ప్రభావితం చేయలేకపోతోంది. అయితే, ఒక చిన్న మ్యూటేషన్ వల్ల ఈ గడువు ఎప్పుడైనా తీరే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని హెచ్‌కేయూ5 రకాలు మింక్స్ వంటి మధ్యంతర జీవుల్లో బయటపడటంతో, మానవులకు సంక్రమించే ముప్పు పెరుగుతోందని పరిశోధకులు భావిస్తున్నారు.

ఈ వైరస్‌లు, మెర్స్ వైరస్‌తో దగ్గర సంబంధం కలిగి ఉండటంతో, అవి మానవుల్లోకి ప్రవేశిస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని వైరాలజిస్ట్ మైఖేల్ లెట్కో హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు మానవుల్లో కనుగొనబడనప్పటికీ, అలాంటి సామర్థ్యం ఉన్నందున హెచ్‌కేయూ5 వైరస్‌లపై గట్టి నిఘా అవసరమని సూచించారు.

ఈ పరిశోధనలో, వైరస్ స్పైక్ ప్రోటీన్ ఏసీఈ2 గ్రాహకంతో పరమాణు స్థాయిలో ఎలా చర్య తీసుకుంటుందో అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అల్ఫాఫోల్డ్ 3 అనే సాధనాన్ని కూడా వినియోగించారు. ఇది సంప్రదాయ ప్రయోగ పద్ధతులతో పోల్చితే వేగంగా, సమగ్ర సమాచారం అందించగలగటం విశేషం. ఈ అధ్యయన ఫలితాలు, భవిష్యత్‌లో విస్తరించే మహమ్మారులను ముందుగానే గుర్తించి, వాటిని ఎదుర్కొనడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించేందుకు కీలకంగా నిలుస్తాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Drinking Alcohol: మ‌ద్యం సేవించే వారికే ఈ స‌మ‌స్య ఉందా? అయితే ఇది తెలుసుకోండి!

Exit mobile version