Dawood: భారత్ టార్గెట్ గా మళ్లీ దావూద్ కుట్రలు

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మళ్ళీ భారత్ ను లక్ష్యంగా చేసుకున్నాడా.... ప్రముఖ రాజకీయనేతలు, వ్యాపారవేత్తలే టార్గెట్ గా దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడా... తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ వెల్లడించిన వివరాలు సంచలనం రేపుతోంది.

  • Written By:
  • Updated On - February 19, 2022 / 12:51 PM IST

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మళ్ళీ భారత్ ను లక్ష్యంగా చేసుకున్నాడా…. ప్రముఖ రాజకీయనేతలు, వ్యాపారవేత్తలే టార్గెట్ గా దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడా… తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ వెల్లడించిన వివరాలు సంచలనం రేపుతోంది. దావూద్ పై ఎన్ఐఎ ఇటీవలే ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. దీనిలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్టు జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. దీని ప్రకారం దేశంలోని పలువురు బడా పారిశ్రామిక వేత్తలతో పాటు రాజకీయ నాయకులను హతమార్చేందుకు దావూద్ కుట్ర పనిన్నట్టు సమాచారం. దీని కోసం బాంబు పేలుళ్ళు, కాల్పులకు ప్రణాళికను రూపొందిస్తున్నట్టుగా ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించినట్టు ఎన్ఐఎ తన ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. దేశరాజధాని ఢిల్లీతో పాటు వాణిజ్య నగరం ముంబైపైనే దాడులు చేయించే విధంగా దావూద్ ప్లాన్ చేసినట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

చాలా కాలంగా దావూద్ కదలికలపై నిఘా ఉంచిన ఇంటిలిజెన్స్ అతను పాకిస్థాన్ లోనే తలదాచుకున్నట్టు ధృవీకరించుకుంది. దీనిని పాక్ ఖండించినా… భారత్ మాత్రం నమ్మడం లేదు.ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాక్ వైఖరిపై ఇప్పటికే పలుసార్లు భారత తీవ్రస్థాయిలో మండిపడింది. కాగా దావూద్ పై ఇటీవలే మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ తమ విచారణలో మరిన్ని కీలక విషయాలు తెలుసుకున్నట్టు అర్థమవుతోంది. దావూద్ మాఫియా లావాదేవీలు, అక్రమ ఆస్తుల వివరాలపై దృష్టి పెట్టి చాలా వరకూ సమాచారం తెలుసుకుంది. ఈ క్రమంలో విచారణ జరుపుతుండగా పేలుళ్ళకు సంబంధించిన కుట్రలు గురించి వెల్లడైనట్టు సమాచారం. ఇటీవలే దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ ను కూడా ఈడీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశముంది.