Site icon HashtagU Telugu

David Warner: వైరల్ గా వార్నర్ ఎమోషనల్ పోస్ట్

David Warner

David Warner

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌పై ఐపీఎల్‌ 2022 సీజన్ మెగా వేలం ప్రారంభానికి ముందు భారీ అంచనాలు ఉండేవి.. కానీ ఆ అంచనాల్ని తలకిందులు చేస్తూ వార్న‌ర్‌ను వేలంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తక్కువ ధరకే కొనుగోలు చేసింది.. ఈసారి వేలంలోకి 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో వ‌చ్చిన వార్న‌ర్‌ను 6 కోట్ల 25 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు ఢిల్లీ ఫ్రాంచైజీ దక్కించుకుంది. నిజానికి ఐపీఎల్‌లో డేవిడ్ వార్న‌ర్ త‌న కెరీర్ ను ఢిల్లీఫ్రాంచైజీ త‌ర‌ఫునే ఆరంభించాడు. ఐపీఎల్ 2009 సీజన్ నుంచి 2013 వ‌ర‌కు ఢిల్లీ జట్టు తరఫునే వార్న‌ర్ బరిలోకి దిగాడు. ఆ తరువాత 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వచ్చిన వార్నర్.. సీజన్ ముగింపులో సారథిగా నియమితుడయ్యాడు. ఆ సీజన్‌లో 528 పరుగులు చేసిన వార్నర్.. 2015లో 562 పరుగులు చేశాడు. ఇక 2016 సీజన్ లో 848 పరుగులు చేసి సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి తొలి టైటిల్ అందించాడు.

అయితే ఈ వేలంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కు దూరమైన డేవిడ్ వార్నర్ తాజాగా వ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టులోని తన సహచర ఆటగాడు, కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో దిగిన ఓ పాత ఫొటోను డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసాడు. కేన్ బ్రదర్ ఇక నుంచి నీతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయలేను, క్రికెట్ ఆడలేను ఈ విషయం గుర్తు తెచ్చుకుంటుంటే చాలా బాధగా ఉంది అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు.. ఇదిలాఉంటే టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు అందుకున్న వార్నర్‌ భాయ్‌ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ కెరీర్ లో మొత్తంగా 150 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 5449 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలున్నాయి.

 

Exit mobile version