Gujarat Titans :మిల్లర్ ది కిల్లర్…చెన్నైపై గుజరాత్ సూపర్ విక్టరీ

ఐపీఎల్ 15వ సీజన్ లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉన్న ఆ జట్టు తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది.

  • Written By:
  • Publish Date - April 17, 2022 / 11:29 PM IST

ఐపీఎల్ 15వ సీజన్ లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉన్న ఆ జట్టు తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో చెన్నై గెలుపు ఖాయమనుకున్న దశలో డేవిడ్ మిల్లర్ సంచలన ఇన్నింగ్స్ తో గుజరాత్ ను గెలిపించాడు. చివర్లో రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ కూడా ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభంలోనే షాక్ తగిలింది. కేవలం 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఫామ్ లో ఉన్న ఊతప్ప, మెయిన్ అలీ సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. తర్వాత రుతురాజ్ గైక్వాడ్ చెన్నైని ఆదుకున్నాడు. ఈ సీజన్ లో తొలిసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్, అంబటి రాయుడుతో కలిసి 92 పరుగుల పార్టనర్ షిప్ నమోదు చేశాడు. రాయుడు 46 పరుగులకు ఔటవగా.. తర్వాత శివమ్ దూబే, రవీంద్ర జడేజా ధాటిగా ఆడారు. వీరితో కలిసి రుతురాజ్ కూడా దూకుడుగా ఆడడంతో చెన్నై సూపర్ కింగ్స్ 169 పరుగులు చేసింది. రుతురాజ్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేయగా… జడేజా కేవలం 12 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు.

170 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ కు పవర్ ప్లేలోనూ దిమ్మతిరిగే షాక్ తగిలింది. చెన్నై బౌలర్ల జోరుకు కేవలం 16 పరుగులకే 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. శుభ్ మన్ గిల్ , విజయ్ శంకర్ డకౌటవగా… సాహా 11 రన్స్ కే ఔటయ్యాడు. తర్వాత అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా కూడా ఔటవడంతో గుజరాత్ ఓటమి ఖాయమనిపించింది. ఈ దశలో డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ పార్టనర్ షిప్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. చాలా కాలం తర్వాత మిల్లర్ తన సహజమైన బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. భారీ షాట్లతో చెన్నై బౌలర్లను ఆటాడుకున్నాడు. అటు రషీద్ ఖాన్ కూడా చెలరేగిపోవడంతో సాధించాల్సిన రన్ రేట్ తగ్గుతూ వచ్చింది. రషీద్ ఖాన్ 21 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 40 పరుగులు చేయగా.. మిల్లర్ టెయిలెండర్లతో కలిసి జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. రషీద్ ఖాన్ ఔటైన తర్వాత ఉత్కంఠ నెలకొన్నా… మిల్లర్ భారీ షాట్లతో గుజరాత్ ను గెలిపించాడు. 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో మిల్లర్ 92 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో బ్రేవో ఆకట్టుకున్నా… క్రిస్ జోర్డాన్ పేలవ బౌలింగ్ గుజరాత్ కు కలిసొచ్చింది. జోర్డాన్ 3.5 ఓవర్లకు 58 పరుగులు సమర్పించుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో గుజరాత్ కు ఇది ఐదో విజయం. మరోవైపు ఆరు మ్యాచ్ లలో చెన్నైకి ఇది ఐదో ఓటమి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై కింది నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.

Pic Courtesy- IPL/Twitter