BRS: ప్రొఫెసర్ కోదండరాం కు దాసోజు బహిరంగ ర్వికెస్ట్.. ఎందుకో తెలుసా

  • Written By:
  • Publish Date - July 3, 2024 / 09:15 PM IST

BRS: బీఆర్ ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రీనివాస్ పలు సమస్యలపై సీఎం రేవంత్ తో సహా ముఖ్య నేతలను ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆయన ప్రొఫెసర్ కోదండరాం కు బహిరంగంగా రిక్వెస్ట్ చేశారు. ‘‘మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేసిన సమయంలో, మీరు వామపక్ష విద్యార్థి ఉద్యమాల సిద్ధాంతకర్తగా,  ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం హైదరాబాద్ నగరశాఖ ఉపాధ్యక్షుడిగా పౌరహక్కుల కోసం మీరు చేసిన కృషి నాకు గుర్తుంది. ఆ సమయంలో నేను నల్లగొండ జిల్లా నాగార్జున ప్రభుత్వ కళాశాల నుండి డిగ్రీ పూర్తి చేసి, ఆర్ట్స్ కళాశాలలో ఎం.ఏ. చదువుతూ జాతీయ భావజాల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న క్రియాశీలక విద్యార్థి నాయకుడిగా, ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై అనేక బాధ్యతలు నిర్వర్తించా’’ అని దాసోజు అన్నారు.

‘‘ఉస్మానియా విద్యార్థి సంఘ నాయకుడిగా, విద్యార్థి హక్కుల కోసం, సమాజంలో అసమానతలకి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో పాల్గొన్నాను. పలు మార్లు జైలుకు వెళ్ళాను. నా అకాడమిక్ కెరీర్ 1990లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. తర్వాత, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ డిపార్ట్‌మెంట్‌లో మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశాను. 1996లో పీహెడీ పూర్తి చేసిన నేను, మానవ వనరుల అంశంపై బోధనతో పాటు, ప్రపంచ బ్యాంకు, డీఎఫ్ఐడి, భారత ప్రభుత్వం, తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్, సింగరేణి, ఎన్ఎండీసి, హెచ్‌జెడీఎల్ వంటి సంస్థలకు రీసెర్చ్ మరియు కన్సల్టింగ్ సేవలు అందించాను. 2000లో, సామాజిక స్పృహ కలిగిన ‘కుబుసం’ అనే చిత్రాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులతో కలిసి నిర్మించాను. మా చిత్రంలోని “పల్లె కన్నీరు పెడుతుంది” అనే పాటను 2004 ఎన్నికల ప్రచారంలో వై.యస్. రాజశేఖర రెడ్డి  కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ఉపయోగించారు’’ అని గుర్తు చేశారు.

‘‘తెలంగాణ ఉద్యమ నాయకుడు కే.సి.ఆర్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో వారి నాయకత్వంలో క్రియాశీల ఉద్యమ బాధ్యతలు నిర్వహించాను. అనేక సందర్భాలలో, మీరే స్వయంగా తెలంగాణ ఉద్యమకారులకు రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదని ఆక్రోశం వ్యక్తం చేసి, ఇప్పుడు  స్వయంగా సహచర ఉద్యమకారుడనైన నా అవకాశాలను, కుట్రపూరితంగా, మరియు కృతజ్ఞతా రాహిత్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం  కాలరాస్తుంటే మీరు ఎలా ఆయనకు సహకరిస్తున్నారు? అత్యంత దుర్మార్గమైన పెట్టుబడి వ్యాపారంగా  మారిన ప్రస్తుత రాజకీయాలలో,  వెనుకబడ్డ, అణగదొక్కబడ్డ  కులాలకు చెందిన మాలాంటి వాళ్లకు సాధారణంగా అవకాశాలు రావు, వచ్చినా డబ్బు సంచులతో ఓడగొడుతారు. అందుకే కెసిఆర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేం’’ అని తేల్చి చెప్పారు.

‘‘రాజ్యాంగబద్ధమైన హక్కుల పోరాటానికి మీరు అడ్డం రావద్దని, తెలంగాణ జేఏసీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా మీ నాయకత్వంలో, మీతోపాటు పనిచేసిన నాకు, తోటి ఉద్యమకారుడిగా,  మా న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలని, మా ఎమ్మెల్సీ నియామకం పొందే వరకు అన్ని రకాలుగా తోడ్పాటు ఇవ్వాలని కోరుతున్నాను. ఎమ్యెల్సీ నియామక విషయంలో మా రాజ్యాంగబద్ధమైన హక్కులు సాధించుకునే వరకు మాకు అండగా ఉండాలని సవినయంగా కోరుకుంటున్నా’’ అని దాసోజు అన్నారు.