Site icon HashtagU Telugu

Hardik Pandya: టీమిండియా కెప్టెన్సీ రేసులో స్టార్ ఆల్ రౌండర్

Hardik Pandya

Pandya

భారత క్రికెట్ జట్టుకు ఇటీవలే అన్ని ఫార్మాట్లలో రోహిత్‌ శర్మ రెగ్యులర్‌ కెప్టెన్‌ గా ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే టీమిండియా సొంతగడ్డపై వరుసగా సిరీస్‌లు గెలిచింది. అయితే ప్రస్తుత సారథి రోహిత్‌ శర్మ వయసు దృష్ట్యా మరో మూడేళ్ళ కంటే ఎక్కువ సారథిగా ఉండే అవకాశం లేదు. దీంతో రోహిత్ వారసుడు ఎవరనే దానిపై చర్చ ఎప్పటి నుంచో నడుస్తోంది. కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ , శ్రేయాస్ అయ్యర్ ఇలా కొన్ని పేర్లు వినిపిస్తుండగా… తాజాగా ఈ రేసులోకి మరో ఆటగాడు వచ్చి చేరాడు.

ఐపీఎల్ గుజరాత్ టైటాన్స్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న కెప్టెన్ హార్థిక్ పాండ్యా భవిష్యత్తులో భారత జట్టు సారథిగా ఎంపికయ్యే అవకాశం ఉందంటూ బెంగాల్‌ క్రీడా మంత్రి మనోజ్‌ తివారి కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ శర్మ తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్ సారథిగా హార్ధిక్‌ పాండ్యా ఎంపికయ్యే అవకాశాలే ఎక్కవగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌ అలాగే యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌కు కెప్టెన్సీ దక్కే అవకాశం లేదని, హార్దిక్ పాండ్యకు మాత్రమే ఆ అర్హత ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో అటు ఆటగాడిగా ఇటు సారథిగా అద్భుతంగా రాణిస్తున్న హార్దిక్ పాండ్య రాబోయే రోజుల్లో అద్భుతాలు చేయడం ఖాయమని మనోజ్ తివారీ విశ్లేషించాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో హార్ధిక్‌ ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌ తో చెలరేగడాన్ని దీనికి ఉదాహరణగా చెప్పుకొచ్చాడు.

దభవిష్యత్తులో హార్ధిక్‌ పాండ్యా బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. గుజరాత్‌ కెప్టెన్‌గా అతని వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయన్న మనోజ్ తివారీ ఈ లక్షణాలే అతన్ని రోహిత్‌ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్‌ను చేస్తాయని అంచనా వేసాడు. మొత్తంగా ఐపీఎల్‌లో హార్ధిక్‌ ప్రదర్శన తనను చాలా ఆకట్టుకుందంటూ తివారీ ట్వీట్ చేశాడు. గుజరాత్‌ టైటాన్స్‌ తరపున అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్ గా హార్దిక్‌ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే పాండ్యా వరసగా రెండు హాఫ్‌ సెంచరీలు సాధించాడు. రాజస్థాన్ పై ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు.

చాలా రోజుల తర్వాత ఆల్ రౌండర్ గా కనిపించాడంటూ పలువురు మాజీలు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో హార్దిక్ పాండ్య సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతోంది ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.