Site icon HashtagU Telugu

Cyclone impact: విమాన రాకపోకలు బంద్

Flight

Flight

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అసాని’ దృష్ట్యా మంగళవారం ఆంధ్రప్రదేశ్ లో విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. తుఫాను రాష్ట్ర తీరానికి చేరుకోవడంతో పాటు భారీ వర్షాలు , ఈదురు గాలులు వచ్చే అవకాశం ఉన్నందున.. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా విశాఖపట్నం విమానాశ్రయానికి బయలుదేరే విమాన సేవలను నిలిపివేశారు. ఇండిగో తన అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్ ఏషియా ఢిల్లీ-విశాఖపట్నం, బెంగళూరు-విశాఖపట్నం విమానాలను రద్దు చేసింది. కాగా ముంబై-రాయ్‌పూర్-విశాఖపట్నం, ఢిల్లీ-విశాఖపట్నం విమానాలను కూడా ఎయిరిండియా రద్దు చేసింది.

తీవ్ర తుఫాను ప్రభావంతో విశాఖపట్నం వద్ద ప్రతికూల వాతావరణం విమాన కార్యకలాపాలను దెబ్బతీసింది. కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి వచ్చే విమానాలను విశాఖపట్నం విమానాశ్రయంలో ల్యాండ్‌ చేయలేక వెనక్కి పంపించాల్సి వచ్చింది. హైదరాబాద్, ముంబై, చెన్నై, విజయవాడ నుంచి కూడా వివిధ విమానయాన సంస్థల విమానాలు రద్దయ్యాయి. ‘అసని’ ఏపీ తీరానికి చేరువవుతుండడంతో కోస్తా ప్రాంతంలో ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తుఫాన్ సమీపిస్తుండటంతో ఏపీ గవర్నమెంట్ అలర్ట్ అయ్యింది. తీర ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగబోతోంది.