Site icon HashtagU Telugu

CV Anand: మూడు కమిషనరేట్ల సీపీగా సీవీ ఆనంద్ ట్రిపుల్ రోల్.. ఈ పరిస్థితి ఎందుకంటే…!

Cv Anand

Cv Anand

హైదరాబాద్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. ఇప్పుడు మూడు కమిషనరేట్లకు కమిషనర్ గా చేస్తున్నారు. నిజానికి రాజధానిలో మొత్తం మూడు కమిషనరేట్లు ఉంటాయి. కానీ సైబరాబాద్ కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్ సీపీలైన స్టీఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్ ఇద్దరూ సెలవుపై విదేశాలకు వెళ్లడంతో సీన్ మారిపోయింది. ఇప్పుడు ఆ రెండు కమిషనరేట్లకు కూడా ఇన్ ఛార్జ్ సీపీగా ఆనంద్ కే బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం ఇదే తొలిసారి. అంటే సీవీ ఆనంద్ ఒకేసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టే.

పోలీస్ కమిషనర్.. తన కమిషనరేట్ పరిధిలో నెలకొన్న పరిస్థితులు, తాజా పరిణామాలు, ఆరోజు ఉండే కార్యక్రమాలపై అధికారులతో రోజూ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. దీంతోపాటు స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఇచ్చే పెరిస్కోప్.. అంటే నివేదికలను కూడా పరిశీలిస్తారు. దానిని బట్టి శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన సూచనలు, సలహాలను తమ సిబ్బందికి ఇస్తారు. అయితే ఇప్పుడు మూడు కమిషనరేట్లకూ సీవీ ఆనందే సీపీ అయినందున… ఈ మూడింటి పరిధిలో రోజూ మూడు టెలీకాన్ఫరెన్స్ లను నిర్వహిస్తున్నారు. పైగా గురువారం నాడు సైబరాబాద్ పరిధిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ప్రధానమంత్రి మోదీ పర్యటన కూడా ఉండడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలన్నదానిపై గచ్చిబౌలిలో సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఐఎస్బీకి కూడా వెళ్లొచ్చారు. దీంతోపాటు ప్రధాని సెక్యూరిటీని చూసే ఎస్పీ, ఐబీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు.

Exit mobile version