Site icon HashtagU Telugu

Karnataka Elections: కన్నడ నాట ప్రచారానికి తెర.. చివరిరోజు హోరెత్తించిన ప్రధాన పార్టీలు

Whatsapp Image 2023 05 08 At 22.17.26

Whatsapp Image 2023 05 08 At 22.17.26

Karnataka Elections: హైవోల్టేజ్‌ ప్రచారానికి ఎండ్‌కార్డ్ పడింది. అధికార విపక్షాలు అత్యంత ప్రతిష్ఠాత్మంగా తీసుకున్నకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీ జేడీఎస్ ఓటర్లను ఆకర్షించేందుకు క్యాంపెయిన్ అదరగొట్టారు. ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగసభలతో హోరెత్తించారు. వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకొని 38 ఏళ్ల చరిత్రను తిరగరాయాలని చూస్తోంది కమలదళం. బీజేపీని గద్దెదించి 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తలుపు తెరవాలని కాంగ్రెస్ భావిస్తోంది. హంగ్ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ అయ్యేందుకు.. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది జేడీఎస్‌. 2024 లోక్‌సభ ఎలక్షన్‌కు ముందు కీలకంగా మారిన నేపథ్యంలో కన్నడ ఓటర్లు ఎవరిపై కరుణ చూపిస్తారనేది దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా తోపాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర్ణాటకలో ప్రచారం హోరెత్తించారు. బీజేపీ తరపున అన్నీ తానై ప్రచారాన్ని ముందుండి నడిపించారు ప్రధాని మోదీ. డబుల్ ఇంజిన్ మంత్రం, అభివృద్ధి అజెండాతో ప్రజల్లోకి వెళ్లారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఏడుసార్లు కర్ణాటకలో పర్యటించిన ప్రధాని.. ఏప్రిల్ 28 నుంచి 18 బహిరంగ సభలు, 3 మెగా రోడ్‌షోలు నిర్వహించారు.అటు కాంగ్రెస్ కూడా దీటుగానే ప్రచారం చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రంలో ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారరథాన్ని నడిపించారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాద్రాతోపాటు మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ నాన్‌స్టాప్‌గా క్యాంపెయిన్ చేశారు. చివరగా హుబ్బళి సభలో పాల్గొన్ని హస్తం శ్రేణుల్లో ఉత్సాహం నింపారు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ. మరోవైపు జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి పంచరత్న సభలతో ప్రజల్లోకి వెళ్లారు.

2024లో లోక్సభ ఎన్నికలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికను ఫస్ట్ సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి రాజకీయపార్టీలు. అందుకే ఓ రేంజ్‌లో ప్రచారం నిర్వహించాయి. 2018లో 3 ప్రధాన పార్టీలు 40 రోజుల్లో 530 రోడ్ షోలను నిర్వహించగా..ఈ ఎన్నికల్లో వాటి సంఖ్య 1,230కు చేరుకుంది. వీటిలో అత్యధికంగా 440 రోడ్ షోలను బీజేపీ, 320 కాంగ్రెస్, 300కుపైగా జేడీఎస్ నిర్వహించింది. అలాగే బీజేపీ అత్యధికంగా 275, కాంగ్రెస్ 240, జేడీఎస్ 221 బహిరంగ సభలు, సమావేశాలను నిర్వహించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 224 స్థానాలు ఉన్న కర్ణాటక శాసనసభకు బుధవారం ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా.. శనివారం ఫలితాలు వెలువడనున్నాయి.