హాట్ హాట్ సమ్మర్‌లో క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చేసింది. ఇవాళ ముంబై వాంఖేడే స్టేడియం వేదికగా 15వ సీజన్ మొదలుకాబోతోంది. గత విజేత చెన్నై సూపర్ కింగ్స్‌తో రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరంభ మ్యాచ్‌లో తలపడనుంది. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రవీంద్ర జడేజా చెన్నైకి సారథ్యం వహించనున్నాడు. అటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను శ్రేయాస్ అయ్యర్‌ను లీడ్ చేయబోతున్నాడు. సీజన్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లూ పట్టుదలగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది. ఇదిలా ఉంటే తొలి మ్యాచ్‌లో పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాలుగు ఫోర్లు కొట్టడం ద్వారా తన ఖాతాలో 200 ఐపీఎల్ ఫోర్లు నమోదు చేసుకుంటాడు.ప్రస్తుతం అతని పేరు మీద 196 ఫోర్లు ఉన్నాయి. అటు ఐపీఎల్‌లో 4 వేల పరుగులు పూర్తి చేసేందుకు అజంక్య రహానే చేరువలో ఉన్నాడు. రహానే ఇప్పటి వరకూ 3941 పరుగులు చేయగా.. మరో 59 పరుగులు చేస్తే 4 వేల క్లబ్‌లో చేరతాడు. కాగా ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్‌లో 150 సిక్సర్లు పూర్తి చేసుకునేందుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటి వరకూ 143 సిక్సర్లు కొట్టిన రస్సెల్ మరో ఏడు సిక్సర్లు బాదితే ఐపీఎల్‌లో 150 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలుస్తాడు. మరోవైపు కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను కూడా అరుదైన రికార్డు ఊరిస్తోంది. టీ ట్వంటీ క్రికెట్‌లో 4500 పరుగులు పూర్తి చేసుకునేందుకు అయ్యర్ 91 పరుగుల దూరంలో ఉన్నారు. అయ్యర్ ఇప్పటివరకు టీ ట్వంటీల్లో 4409 పరుగులు చేశాడు. అలాగే సునీల్ నరైన్ 3000 టీ20 పరుగులు పూర్తి చేయడానికి 74 పరుగుల దూరంలో నిలిచాడు. బంతితో పాటు బ్యాట్‌తోనూ గత కొంతకాలంగా రాణిస్తున్న నరైన్ ఇప్పటివరకు 2926 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన డ్వేన్ బ్రావోను కూడా సిక్సర్ల రికార్డు ఊరిస్తోంది. మరో మూడు సిక్సర్లు కొట్టడం ద్వారా ఐపీఎల్‌లో 50 సిక్సర్లను పూర్తి చేసుకుంటాడు. అలాగే చెన్నై తరపున 100 ఫోర్లు పూర్తి చేసుకోనున్న ఆటగాడిగానూ బ్రావో ఘనత సాధించనున్నాడు. అలాగే తెలుగుతేజం అంబటి రాయుడు కూడా సిక్సర్ల రికార్డుకు చేరువలో నిలిచాడు. రాయుడు మరో సిక్సర్ కొడితే ఐపీఎల్‌లో 150 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. ఇక చెన్నై సూపర్‌కింగ్స్ సారథిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్న రవీంద్ర జడేజా అరుదైన మైలురాయి ముంగిట నిలిచాడు. కోల్‌కతాతో మ్యాచ్‌లో మరో వికెట్ తీస్తే ఆ జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలుస్తాడు. ఇప్పటి వరకూ రవిచంద్రన్ అశ్విన్ కోల్‌కతాపై 16 వికెట్లు తీస్తే గత సీజన్‌లోనే జడేజా దీనిని సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో జడ్డూ అశ్విన్‌ను వెనక్కి నెట్టే అవకాశముంది.