Site icon HashtagU Telugu

CSK Playoffs: దర్జాగా ప్లే ఆఫ్‌కు చెన్నై… ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన ధోనీసేన

DC vs CSK

New Web Story Copy 2023 05 20t200726.039

CSK Playoffs: ఐపీఎల్ 16వ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్ చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్లే ఆఫ్‌కు దూసుకెళ్ళింది. కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 77 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన ధోనీసేన వేరే జట్ల మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్‌కు క్వాలిఫై అయింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ల ఆటే హైలెట్‌.. తమ సూపర్ ఫామ్ కొనసాగిస్తూ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అదరగొట్టారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. ఢిల్లీ బౌలింగ్‌ను ఆటాడుకున్న వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు. రుతురాజ్, కాన్వే తొలి వికెట్‌కు 14.3 ఓవర్లలో 141 పరుగులు జోడించారు. రుతురాజ్ 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 రన్స్ చేయగా… కాన్వే 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. తర్వాత శివమ్ దూబే 9 బంతుల్లోనే 3 సిక్సర్లతో 22 రన్స్ చేయగా.. జడేజా కూడా మెరుపులు మెరిపించాడు. జడ్డూ 7 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 20 పరుగులు చేశాడు. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్ 3 వికెట్లకు 223 పరుగులు భారీస్కోర్ సాధించింది. ఢిల్లీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఖలీల్ అహ్మద్, నోర్జే, సకారియా ఒక్కో వికెట్ తీశారు.

ఛేజింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అత్యంత పేలవంగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన పృథ్వీ షా నిరాశపరిచాడు. 5 పరుగులకే ఔటయ్యాడు. ఫిలిప్ సాల్ట్ 3 , రొసు డకౌటయ్యారు. దీంతో ఢిల్లీ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వార్నర్ కూడా అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోయాడు. పవర్ ప్లేలో ఢిల్లీ కేవలం 34 పరుగులే చేయగలిగింది. వార్నర్ ఒకవైపు పోరాడినా… మరో ఎండ్‌లో ఢిల్లీ వికెట్లు కోల్పోతూ వచ్చింది. యశ్ ధుల్ 13 , అక్షర్ పటేల్ 15 , హకీమ్ ఖాన్ 7 పరుగులకు ఔ టయ్యారు. వార్నర్ హాఫ్ సెంచరీ సాధించగా… ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. వార్నర్ 58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 86 పరుగులకు ఔటయ్యాడు. చివరికి ఢిల్లీ 20 ఓవర్లలో 146 పరుగులే చేయగలిగింది. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ 3 , పతిరణ 2 , తీక్షణ 3, తుషార్ దేశ్‌పాండే , జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో చెన్నై లీగ్ స్టేజ్‌ను రెండో స్థానంలో ముగించింది. మరోవైపు ఆద్యంతం పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్‌ను ఓటమితో ముగించింది.

Read More: DC vs CSK: చెన్నై భారీ టార్గెట్ (223).. అదరగొట్టిన ఓపెనర్స్

Exit mobile version