CRPF Exams: ఇక ఆ ఎగ్జామ్స్ తెలుగులోనూ.. కేంద్ర సర్కారు కీలక నిర్ణయం

వచ్చే ఏడాది నుంచి 13 ప్రాంతీయ భాషల్లో సీఏపీఎఫ్ పరీక్షలను నిర్వహించ నున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ప్రాంతీయ భాషల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.

CRPF Exam are also in Telugu Language : సెంట్రల్‌ రిజర్వ్‌డ్ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF) ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. వచ్చే ఏడాది నుంచి 13 ప్రాంతీయ భాషల్లో సీఏపీఎఫ్ పరీక్షలను నిర్వహించ నున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ప్రాంతీయ భాషల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. హిందీ, ఇంగ్లీష్ మాత్రమే కాకుండా అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మళయాలం, కన్నడ, తమిళ్, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపూరీ, కొంకణీ భాషల్లోనూ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. CRPF, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, ఎన్ఎస్‌జీ ఇవన్నీ సీఏపీఎఫ్ కిందకే వస్తాయి.

కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే ఈ పోటీ పరీక్షలను నిర్వహించడం వలన తీవ్ర వివక్షత ఏర్పడుతుందని, ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో చదవని వారు లేదా హిందీ ప్రాంతాలకు చెందని అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని కేంద్రానికి ఎన్నో ఫిర్యాదు లేఖలు అందాయి. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తమిళ భాషలో పరీక్ష నిర్వహించాలని కొన్ని రోజుల క్రితమే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. స్టాలిన్‌ ఈ విషయమై అమిత్‌ షాకు లేఖ సైతం రాశారు.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం స్టాలిన్ స్వాగతించారు. తన లేఖను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని అన్నారు. మిగతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోను రాష్ట్రీయ భాషలలో రాసే అవకాశం కల్పించాలని కోరారు. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని ఇటీవల డిమాండ్లు వినిపించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే తాజా ప్రకటన వెలువడింది.

Also Read:  RRB: ఆ ఎగ్జామ్ రాసిన వాళ్లకు రూ.400.. రీఫండ్ ప్రకటించిన ఆర్ఆర్బీ..