Bakrid : బక్రీద్ సందర్భంగా అధికారుల‌తో హైద‌రాబాద్ సీపీ రివ్యూ మీటింగ్‌

  • Written By:
  • Publish Date - July 5, 2022 / 10:16 PM IST

హైదరాబాద్: త్వరలో జరగనున్న బక్రీద్ పండుగ ఏర్పాట్ల కోసం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సాలార్ జంగ్ మ్యూజియంలో అన్ని శాఖల అధికారులు, ముస్లిం మతపెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం మతపెద్దలు వీధులను పరిశుభ్రంగా ఉంచేంలా చూడాల‌ని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలపై సమీక్షించారు. 300 శానిటేషన్ వాహనాలు, అదనంగా 55 వాహనాలు నేరుగా పోలీస్ స్టేషన్‌లకు కేటాయిస్తారు. సులువుగా పంపిణీ చేసేందుకు మసీదులు, పోలీస్ స్టేషన్ల వద్ద చెత్త సంచులను సిద్ధంగా ఉంచుతామని, సౌత్ జోన్‌లో 2 లక్షల చెత్త బస్తాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

నగర పోలీసులకు సహకరిస్తామని, పోలీసులు అందించే భద్రతా సూచనలను పాటిస్తామని హాజరైన వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీవీ ఆనంద్ మాట్లాడుతూ చెక్‌పోస్టులను పోలీసు సిబ్బంది, జీహెచ్‌ఎంసీ, పశుసంవర్ధక సిబ్బంది మాత్రమే నిర్వహిస్తారని హామీ ఇచ్చారు. పశువుల అక్రమ రవాణా గురించి ఎవరికైనా సమాచారం ఉంటే దానిని అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఇతర విభాగాలతో మెరుగైన సమన్వయం కోసం మొత్తం 21 మంది అధికారులను లైజన్ ఆఫీసర్లుగా కేటాయించారు.