National Animal: జాతీయ జంతువుగా ఆవు… అలహాబాద్ హైకోర్టు తీర్పు!

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అలహాబాద్ హైకోర్టు పిలుపునిచ్చింది. గోహత్యను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

  • Written By:
  • Publish Date - March 5, 2023 / 11:24 AM IST

National Animal: గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అలహాబాద్ హైకోర్టు పిలుపునిచ్చింది. గోహత్యను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ గోహత్య నిరోధక చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడి పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ షమీమ్ అహ్మద్ సింగిల్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది

గొడ్డు మాంసం తీసుకెళ్తున్నందుకు మహ్మద్ అబ్దుల్ ఖలీక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణను ముగించాలని కోరుతూ నిందితుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా హిందువులకు గోవుపై విశ్వాసం ఉన్నాయని, వారు దానిని అత్యంత పవిత్రమైన జంతువుగా, దేవుని ప్రతినిధిగా భావిస్తారని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొంది. మనం లౌకిక దేశంలో జీవిస్తున్నామని, కాబట్టి అన్ని మతాల పట్ల గౌరవం కలిగి ఉండాలని బెంచ్ తెలిపింది. హిందూమతంలో ఆవును దైవిక, సహజమైన దయకు ప్రతినిధిగా భావిస్తారని పేర్కొంది.

గోహత్యను నిలిపివేస్తే భూమ్మీద ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని గత నెలలో గుజరాత్ కోర్టు పేర్కొంది. మహారాష్ట్ర నుంచి అక్రమంగా పశువులను తరలించిన కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గోవధను నిలిపివేస్తే భూమ్మీద ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తాపి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి నవంబర్ లో ఉత్తర్వులు జారీ చేసినట్లు లీగల్ న్యూస్ వెబ్ సైట్ లైవ్ లా తెలిపింది.