Covid: ఢిల్లీలో కరోనా ఫోర్త్ వేవ్ మొదలైందా?

కరోనాకు సమాధి కట్టేశాం.. ఇక దానితో భయం లేదు అని చాలామందిలో ఫీలింగ్ ఉంది.

  • Written By:
  • Updated On - April 16, 2022 / 11:38 AM IST

కరోనాకు సమాధి కట్టేశాం.. ఇక దానితో భయం లేదు అని చాలామందిలో ఫీలింగ్ ఉంది. కానీ దేశ రాజధానిలో పెరుగుతున్న కేసులు చూస్తే ఆ విషయాన్ని మరోసారి ఆలోచించుకోవాల్సి వస్తోంది. ఢిల్లీపై మహమ్మారి మళ్లీ పంజా విసిరినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా పెరుగుతోంది. వారం రోజులుగా అక్కడ ఇదే పరిస్థితి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గిపోవడంతో చాలామంది ఈ మహమ్మారిని లైట్ తీసుకున్నారు. ప్రభుత్వాలు కూడా కొవిడ్ ఆంక్షలను పూర్తిగా ఎత్తేయడంతో చాలామంది కనీసం మాస్క్ కూడా పెట్టుకోవడం లేదు. ఇప్పుడు మళ్లీ కేసులు పెరగడం, ఎక్కువమంది హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటుండడంతో మళ్లీ ఆందోళన మొదలైంది. తాజా లెక్కలను పరిశీలించినా ఈ విషయం అర్థమవుతుంది.

గత వారం రోజులుగా ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయి. గురువారం నాటికి ఇవి 325 కి చేరాయి. హోం ఐసోలేషన్ లో కేసుల సంఖ్య 48 శాతం పెరిగి 574కు చేరింది. ఏప్రిల్ 11 నాటికి 447 కేసులే ఉన్నాయి. కానీ కేవలం మూడే రోజుల వ్యవధిలో అంటే.. ఏప్రిల్ 14 నాటికే ఇంకో 127 మంది కొవిడ్ బారిన పడ్డారు. దీంతో వారంతా ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 500 కేసులు అంటే చాలా ఎక్కువ. అందుకే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ విషయం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

పైగా పాజిటివిటీ రేటు కూడా ఈనెల మొదట్లో.. 0.57 శాతం ఉన్నది కాస్తా.. 14 తేదీకి 2.39 శాతానికి పెరిగింది. కేవలం రెండు వారాల వ్యవధిలో ఈస్థాయిలో పాజిటివిటీ రేటు పెరగడంతో నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పైగా స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లపైనా కొవిడ్ పంజా విసరడంతో.. కేసులు బయటపడితే ఆ స్కూళ్లను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీలో కేసులు పెరగడంతో కేంద్రం కూడా దానిపై ఫోకస్ పెట్టింది. ఎందుకంటే దేశ రాజధానికి.. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి రాకపోకలు ఉంటాయి. ఇది నాలుగో వేవ్ కి సంకేతమా అన్న అనుమానాలు ప్రజల్లో ఉండడంతో… కేసులు మళ్లీ పెరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉంది.