Road Mishap: రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్‌ఐ దుర్మరణం పాలయ్యాడు.

  • Written By:
  • Publish Date - May 2, 2023 / 11:41 PM IST

Road Mishap: ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్‌ఐ దుర్మరణం పాలయ్యాడు. ఏటూరునాగారం మండం జీడివాగు వద్ద మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు బోల్తాపడడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో ఏటూరు నాగారం ఎస్‌ఐ ఇంద్రయ్యతో పాటు ప్రైవేటు డ్రైవర్‌ మృతి చెందారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతమైన వెంకటాపురం నూగురు మండలంలో పోలీసుల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది.

ఈ సమావేశం ముగిసిన తర్వాత భద్రాచలానికి చెందిన ఉన్నతాధికారులకు ఏటూరు నాగారం ఎస్‌ఐ ఇంద్రయ్య, మరో కానిస్టేబుల్ శ్రీనివాస్‌తో పాటు డ్రైవర్ చెట్టుపల్లి రాజుతో కలిసి మరొక వాహనంలో ఎస్కార్ట్‌గా వెళ్తున్నారు. ఏటూరు నాగారం నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత జీడివాగు వద్ద ఎస్కార్ట్ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఎస్‌ఐ ఇంద్రయ్యతో పాటు డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందారు.

కానిస్టేబుల్ శ్రీనివాస్ గాయాలతో బయటపడ్డారు. ఎస్‌ఐ ఇంద్రయ్య స్వస్థలం హనుమకొండ జిల్లా పలివేలుపుల గ్రామం. ప్రైవేట్‌ డ్రైవర్‌ రాజుది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపురం గ్రామమని పోలీసులు తెలిపారు. కారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మలుపు దగ్గర అదుపుతప్పడంతోనే కారు బోల్తా పడినట్టు భావిస్తున్నారు. అయితే ప్రమాదంలో ఎస్‌ఐ చనిపోయారని తెలిసినా స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో చీఫ్ ప్రభాకరన్ కాన్వాయ్ ఆపకుండానే వెళ్ళిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ గౌస్ ఆలం ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.