Site icon HashtagU Telugu

World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్‌కు షాక్‌… ఇంగ్లాండ్‌పై కివీస్ ఘనవిజయం

World Cup 2023 (15)

World Cup 2023 (15)

World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు తొలి మ్యాచ్‌లోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. గత ఎడిషన్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కివీస్ ఇన్నింగ్స్‌లో కాన్వే, రచిన్ రవీంద్ర సెంచరీలు హైలెట్‌గా నిలిచాయి. (ENG vs NZ)

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. స్టోక్స్ గాయంతో దూరమవడంతో అతను లేకుండానే బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. ఓపెనర్లు బెయిర్ స్టో, మలాన్ తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించారు. బెయిర్ స్టో 33 , మలాన్ 14 పరుగులకు ఔటవగా.. తర్వాత క్రీజులోకి వచ్చిన రూట్, హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. బ్రూక్ 25 , మొయిన్ అలీ 11 రన్స్‌కే ఔటవగా… రూట్ మాత్రం నిలకడగా ఆడాడు. 86 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 77 పరుగులు చఏశాడు. అలాగే బట్లర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఐదో వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. అయితే కివీస్ బౌలర్లు సెకండాఫ్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ దూకుడుకు బ్రేక్ పడింది. చివర్లో లివింగ్‌స్టోన్ 20, ఆదిల్ రషీద్ 15 , మార్క్ 13 రన్స్ చేశారు. దీంతో ఇంగ్లాండ్ 9 వికెట్లకు 282 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, శాంట్నర్ 2, గ్లెన్ ఫిలిప్స్ 2 వికెట్లు పడగొట్టారు.

283 పరుగుల లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. విల్ యంగ్ డకౌటయ్యాడు. ఇక్కడ నుంచి మరో ఓపెనర్ డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర రెచ్చిపోయారు. ఇంగ్లాండ్‌కు తొలి వికెట్‌ దక్కిన ఆనందం కొంచెం సేపు కూడా మిగలనివ్వలేదు. ఇంగ్లీష్ బౌలర్లను ఎడాపెడా బాదేశారు. పవర్ ప్లేలో 80 పరుగులకు పైగా చేసిన వీరి జోడీ ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడింది. ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ తరపున ప్రపంచకప్‌లో ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో వికెట్‌కు కాన్వే , రవీంద్ర 273 పరుగుల అజేయ భాగస్వామ్యం సాధించారు. వరల్డ్‌కప్‌ చరిత్రలో కివీస్‌కు ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ పార్టనర్‌షిప్‌. 36 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న వీరిద్దరూ సెంచరీకి మాత్రం ఎక్కువ బాల్స్‌ తీసుకోలేదు. కాన్వే 83 బంతుల్లోనే శతకం సాధిస్తే… రచిన్‌ 81 బంతుల్లో సెంచరీ చేశాడు. వన్డేల్లో కాన్వేకు ఇది ఐదో సెంచరీ కాగా..రచిన్‌కు కెరీర్‌లో తొలి శతకం. వీరిద్దరి జోరుతో మ్యాచ్ వన్‌సైడ్‌గా మారిపోయింది. కివీస్ 36.2 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. కాన్వే 121 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో 152 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 పరుగులు చేశాడు.

Also Read: Worl Cup 2023: చెలరేగి ఆడుతున్న కివీస్‌ బ్యాటర్లు