Site icon HashtagU Telugu

Rg kar Murder Case : ఆర్జీ కర్ హత్యాచార కేసులో దోషికి జీవితఖైదు

Convict sentenced to life imprisonment in RG Kar murder case

Convict sentenced to life imprisonment in RG Kar murder case

Rg kar Murder Case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హత్యాచార కేసులో దోషి సంజయ్ రాయ్‌కి శిక్ష ఖరారైంది. దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధిస్తూ సీల్దా కోర్టు సోమవారం తీర్పిచ్చింది. అంతేకాక..అతడికి రూ.50 వేలు జరిమానా కూడా విధించింది. బాధిత కుటుంబానికి రూ.17లక్షల పరిహారం ఇవ్వాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే, కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దోషికి మరణశిక్ష విధించాలంటూ వైద్యురాలి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా,  గతేడాది ఆగస్టు 9న ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్యకు గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ పై కూడా అనుమానాలు కలిగాయి. ఈ కేసులో తొలుత కోల్ కతా పోలీసులు విచారణ చేపట్టగా, అనంతరం సీబీఐ దర్యాప్తు సాగించింది. అన్ని ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం… పోలీసు వాలంటీరు సంజయ్ రాయ్ ని దోషిగా నిర్ధారించింది.

మరోవైపు తాజాగా కోర్టు ఏమైనా చెప్పుకునేది ఉందా..? అని ప్రశ్నించగా.. సంజయ్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కావాలనే ఇరికించారని కంటతడి పెట్టుకున్నాడు. నేరానికి పాల్పడినట్టుగా ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేశారని తెలిపారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నాడు. తనకు ఉరిశిక్ష కాకుండా.. జైలు శిక్షను విధించాలని ప్రాధేయపడ్డాడు. ఈ కేసులో సాక్ష్యాలను మార్చినందుకు ఆర్‌జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌తోపాటు స్థానిక పోలీసు స్టేషన్‌ మాజీ ఎస్‌హెచ్‌ఓకు బెయిల్‌ ఇవ్వడాన్ని రాయ్‌ ప్రశ్నించాడు. తాజాగా కోర్టు తీర్పు వెల్లడించింది. సంజయ్ రాయ్ కి జీవిత ఖైదీ విధించింది సీబీఐ స్పెషల్ కోర్టు. బీఎన్ఎస్ 64, 66, 103/1 సెక్షన్ల కింద సీల్దా కోర్టు దోషిగా తేల్చింది.

Read Also: Clean Energy Policy : అద్భుతంగా ‘క్లీన్ ఎనర్జీ పాలసీ’.. చంద్రబాబు విజన్‌పై యావత్ దేశంలో చర్చ