న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి సమాన్లు జారీ చేసింది. జులై 21న విచారణకు రావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. అయితే దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయాలని బుధవారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈరోజు (గురువారం) పార్టీ మరో ముఖ్యమైన సమావేశానికి పిలుపునిచ్చింది. ఇందులో ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు, పీసీసీ చీఫ్‌లు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో నిరసన కవాతు, ఇతర ప్రజావాణి కార్యక్రమాలపై అగ్రనేతలు చర్చించనున్నారు. జూలై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు కూడా పార్లమెంట్ ఆవరణలోనే నిరసనకు దిగనున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇలాంటి విషయాలకు భయపడరని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. సోనియా ఈడీ కార్యాలయానికి విచారణకు వెళ్తారని తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సాల్‌లను విచారించిన నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారణకు పిలిచింది. వారితో పాటు ఈ కేసులో గత నెల జూన్‌లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని ఈడీ ఐదు రోజులకు పైగా ప్రశ్నించింది. ఆ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుపై ప్రజల్లో పంపిణీ చేసేందుకు పార్టీ కరపత్రాలను కూడా సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నేటి సమావేశానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, ఎఐసిసి కోశాధికారి పవన్ బన్సాల్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్, రణదీప్ సూర్జేవాలా, భవర్ జితేంద్ర సింగ్, రాజ్యసభ ఎంపి, ఎఐసిసి పాల్గొన్నారు. ఢిల్లీ ఛార్జ్ శక్తిసిన్హ్ గోహిల్ హాజరుకానున్నారు.