కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలవడంపై కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈడీ విచారణని ఖండిస్తూ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపట్టనుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, మాజీ మంత్రులు ఎం. శశిధర్‌రెడ్డి, డాక్టర్.జె.గీతారెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని, అనేక నిత్యావసర వస్తువులపై జిఎస్‌టిని విధించిందని తెలిపారు. బీజేపీ దేశాన్ని విభజించి పాలించాలని చూస్తోందని గీతారెడ్డి ఆరోపించారు. బీజేపీ విభజన, విభజించి పాలించే విధానాన్ని ఎదుర్కొనేందుకు తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను వేధించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈడీ కేసులు పెట్టిందని, నిరసనకు ముందు నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్ వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని టీకాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్ గాంధీని ఈడీ ఇప్పటికే చాలా రోజులు విచారించిందని, ఇప్పుడు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారించబోతోందని తెలిపారు.
ఈడీ వేధింపులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను వేధిస్తే కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారని, ఇలాంటి చర్యలతో తమ పార్టీ ఎప్పటికీ బలహీనపడదన్నారు. గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని ఎం అంజన్‌కుమార్ యాదవ్ అన్నారు. ఇదే అంశంపై జులై 22న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈడీ కేసులు పెట్టిందని టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడే రోజునే సోనియా గాంధీని ఈడీ ఇంటరాగేషన్‌కు పిలుస్తోందని చెప్పారు. సోనియా గాంధీ గానీ, రాహుల్ గాంధీ గానీ ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని ఆయన స్పష్టం చేశారు.