USA Gun Control: హమ్మయ్య! అమెరికాలో తుపాకుల నియంత్రణ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం

అభివృద్ధిలో అమెరికాతో పోటీ పడడం కష్టం. అలాగే అక్కడి గన్ కల్చర్ తో కూడా పోటీ పడలేం.

  • Written By:
  • Publish Date - June 25, 2022 / 10:40 AM IST

అభివృద్ధిలో అమెరికాతో పోటీ పడడం కష్టం. అలాగే అక్కడి గన్ కల్చర్ తో కూడా పోటీ పడలేం. అందుకే నిత్యం ఏదో ఒక చోట తుపాకీ పేలూతూనే ఉంటుంది. దాని తూటాలు అమాయకుల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. వచ్చే నవంబర్ లో అక్కడి కాంగ్రెస్ కు మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే వేరే దారిలేక.. అక్కడున్న డెమోక్రాట్లు, రిపబ్లికన్లు.. తుపాకుల నియంత్రణ బిల్లుకు ఆమోదం తెలిపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి సెనేట్ తో పాటు కాంగ్రెస్ కూడా ఈ బిల్లును ఆమోదించడంతో తుపాకీ సంస్కృతిని వ్యతిరేకిస్తున్న శాంతికాముకుల సంతోషానికి అవధుల్లేవు.

ఇప్పుడీ తుపాకుల నియంత్రణ బిల్లు దేశాధ్యక్షుడు జోబైడెన్ ముందుకు వెళ్లింది. ఆయన దానిపై సంతకం చేస్తే.. అది చట్టంగా మారుతుంది. తాను సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు గతంలోనే ఆయన ప్రకటించారు. అమెరికాలోని రిపబ్లికన్లలో కొందరు తుపాకీ సంస్కృతికి మద్దతిచ్చినా.. మరికొందరు మాత్రం వ్యతిరేకించారు. గన్ ఇండస్ట్రీకి వీరి మద్దతు ఉంది. అలా ఈ బిల్లును వ్యతిరేకించిన వారిలో జాష్ హోలీ, టెడ్ క్రూజ్, టిమా స్కార్ వంటి అమెరికా రిపబ్లికన్ సెనేటర్లు ఉన్నారు. వీరంతా 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవారే. అందుకే రిపబ్లికన్ల మద్దతు కోసం వీరు ఈ బిల్లును వ్యతిరేకించారు.

ఈ బిల్లులో ఏముందంటే.. 18-20 ఏళ్ల మధ్య వయసున్న వారు తుపాకులు కొనాలంటే.. ముందుగా వారికి నేరచరిత్ర ఉందా లేదా అని అక్కడి ఫెడరల్, స్థానిక అధికారులు చెక్ చేస్తారు. ఇంతకుముందు ఈ చెకింగ్ కేవలం మూడు రోజుల్లోనే పూర్తిచేయాల్సి వచ్చేది. ఇప్పుడు అధికారులు పదిరోజుల సమయం తీసుకోవచ్చు.

గతంలో ఎవరైనా సరే గృహ హంసకు పాల్పడి ఉంటే.. అలాంటివారికి తుపాకులు కొనే అర్హత ఉండదు. ఇక వేరేవారికోసం తుపాకులు కొన్నా.. వాటిని అక్రమార్కులకు చేరవేయడానికి కొన్నా.. అలాంటివారికి 25 ఏళ్ల వరకు శిక్ష విధించేలా బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి.