Site icon HashtagU Telugu

MLC Kavitha: బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు: ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: తెలంగాణ అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కులగణన తీర్మానం కేవలం కంటితుడుపు చర్య అని ఆమె కొట్టిపారేశారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, తక్షణమే ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని ఆమె డిమాండ్‌ చేశారు. బీసీ సబ్ ప్లాన్‌కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కవిత మాట్లాడారు. కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో, ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదని అన్నారు. స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్య అని విమర్శించారు.

తలాతోక లేని తీర్మానాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని చెప్పారు. బీసీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన చేపట్టే ముందు చట్టం చేశారని చెప్పారు.కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక చరిత్ర అని ఆరోపించారు. మండల్ కమిషన్ సమయంలో పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తుచేశారు. 2011లో యూపీఏ హయాంలో చేసిన కులగణన నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు బీసీలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ బాధ్యతలేని మాటలు మానుకోవాలని హితవుపలికారు.