Site icon HashtagU Telugu

Cong dispute: వర్గపోరు మళ్ళీ తెరపైకి..!

Congress Leaderscollage Imresizer

Congress Leaderscollage Imresizer

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో వర్గపోరు మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన రచ్చబండ కార్యక్రమం పార్టీలో మరోసారి రచ్చకు దారితీసింది. కేసీఆర్ ఫామ్ హౌజ్ ఉన్న ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ పిలుపునిచ్చారు. అయితే రేవంత్ పిలుపునిచ్చిన రచ్చబండ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే గా ఉన్న తనకు చెప్పకుండా కార్యక్రమాన్ని ఎలా ప్రకటిస్తారని జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి పై ఫైరయ్యారు.

ఇదేవిషయమై జగ్గారెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ అందర్నీ కలుపుకుని వెళ్లడం లేదని, రేవంత్ రెడ్డి మైండ్ సెట్ మార్చండి లేదా కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించండంటూ జగ్గారెడ్డి లేఖలో పేర్కొన్నారు. జగ్గారెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ లోని పలువురు సీనియర్ నాయకులు కూడా రేవంత్ రెడ్డి తీరును తప్పుపట్టారట. ఎవరికీ తెలియకుండా కార్యక్రమం తలపెట్టడమేంటని రేవంత్ పై అసహనంగా ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీగా ఒక కార్యక్రమం తీసుకునేముందు ముఖ్యనేతలతో చర్చించకుండా రేవంత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ,రాహుల్ గాంధీల సిద్దాంతాల ప్రకారం కొనసాగడం లేదని, ఒక కార్పొరేట్ పార్టీ ఆఫీస్ గా వ్యవహారం నడుస్తోందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. రేవంత్ ఏకపక్ష వ్యవహారంలో ఏదో కుట్ర జరుగుతుందని, సోనియా, రాహుల్ గాంధీ ఈ అంశాన్ని గమనించాలని, రేవంత్ వ్యవహారంపై విచారణ జరిపించాలని జగ్గారెడ్డి అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగుంటేనే ఉంటే తమలాంటి రాజకీయ నాయకులకు నైతిక స్థైర్యం ఉంటుందని, మరణం వరకూ కాంగ్రెస్ పార్టీతోనే బ్రతుకుతామని జగ్గారెడ్డి అన్నారు. పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డితో పార్టీలో ఉండే సీనియర్ నాయకులెవ్వరికీ సఖ్యత లేదని, గెలుస్తామని భరోసా ఉన్న బలమైన నాయకులకు కూడా రేవంత్ రెడ్డితో ఎలాంటి సత్సంబందాలు లేవని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇలాంటి పరిణామం కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరమని, ఇది పార్టీ నాయకులకు కూడా ప్రమాదమేనని, తన వ్యవహారంతో పార్టీకి మరింత నష్టం జరగకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి మైండ్ సెట్ మార్చాలని, లేదా పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని జగ్గారెడ్డి కోరారు.

Exit mobile version