తెలంగాణాలో వరిధాన్యం అంశం మళ్ళీ హాట్ టాపిక్ గా మారుతోంది. అన్ని పార్టీల ఎజెండా ఇప్పుడు వరిధాన్యమే అయ్యింది. వరిధాన్యం అంశాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ అంశంపై వరుస కార్యక్రామాలు చేస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.
రైతులు వరి ధాన్యంతో రోడ్డుపై పడుకుంటే కేసీఆర్ ప్రగతి భవన్ లో పడుకుంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణ వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకున్నామని కానీ మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన విమర్శించారు. రాజకీయంగా కాంగ్రెస్ లో లాభం లేకున్నా ప్రజల కోసం సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారని, అయితే ఏడేళ్లు గడిచినా సమస్యలు అట్లనే ఉన్నాయని, స్వయం పాలనలో రైతులు రోడ్ల వెంట పడుకునే పరిస్థితి వచ్చిందని జగ్గారెడ్డి తెలిపారు.
రైతులు ఎండల్లో ఎండుతుంటే సీఎం ఏసీ రూముల్లో ఉంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని, కేంద్రమే ధాన్యం కొనాలనే ఆలోచనతో నెహ్రు ఎఫ్సీఐ ఏర్పాటు చేశారని, అప్పటి నుండి యూపీఏ అధికారంలో ఉన్నప్పటి వరకు ధాన్యం కొనుగోలు సమస్య రాలేదని, వడ్లు కొనకపోడం బీజేపీ, టీఆర్ఎస్ నేతలు సృష్టించిన సమస్య అని, రైతులు రోడ్ల మీద పడటానికి ఆ రెండుపార్టీలే కారణమని ఆయన తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు బీజేపీకి ఓటేశారని, ప్రతి విషయంలో బీజేపీ చెప్పినట్టు టీఆర్ఎస్ నేతలు చేశారని జగ్గారెడ్డి తెలిపారు. మన రైతులు రోడ్ల మీద పడుకుంటే ప్రధానిని ఒప్పించి వడ్లు కొనేలా ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించిన జగ్గారెడ్డి బీజేపీ తో విందులు చేసుకుంటారు కానీ ధాన్యం మాత్రం కొనుగోలు చేసేలా చేయడం లేదని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం కుస్తీ పడుతున్నారని, సీఎం ఢిల్లీకి వెళ్తేనే ఏం కాలేదు ఇప్పుడు మంత్రులు ఢిల్లీ వెళ్లి చేసేదేమీ లేదని, కాంగ్రెస్ బలపడుతోందని బీజేపీ టీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొనుగోలు కేంద్రాలను పెడుతామని రైతులకు అండగా ఉంటామని ఆయన తెలిపారు.