Site icon HashtagU Telugu

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు: హరీశ్ రావు

Mla Harish Rao

Mla Harish Rao

Harish Rao: గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు.  ‘‘గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనను, ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశాం. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా, నిరాశలోకి నెట్టేసేలా గ్రూప్ అభ్యర్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండా క్యాబినెట్ సమావేశం ముగించారు. ఉసూరుమనిపించారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మీరు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి ఇస్తామని మాట ఇచ్చారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో వివిధ శాఖల్లో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి మీకు ఓటేశారు. మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఆరు నెలలు దాటింది. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు మీరు నియామక పత్రాలను ఇచ్చారు తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మిమ్మల్ని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడి అలమటించవలసిన పరిస్థితి తెచ్చారు. గ్రూప్ 1, డిఎస్సీ తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బంది కరంగా మారింది. కనీసం వారు చేస్తున్న విజ్ఞప్తిని వినే పరిస్థితిలో కూడా మీ ప్రభుత్వం లేకపోవడం శోచనీయం’’ అని హరీశ్ రావు అన్నారు.