Congress: ఢిల్లీలో కాంగ్రెస్ సీనియ‌ర్ల లైజ‌నింగ్‌

కాంగ్రెస్ అధిష్టానం శ‌నివారం అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శులు, ఆయా రాష్ట్రాల ఇంచార్జిల‌తో కీల‌క స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌నుంది.

  • Written By:
  • Updated On - March 24, 2022 / 04:13 PM IST

కాంగ్రెస్ అధిష్టానం శ‌నివారం అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శులు, ఆయా రాష్ట్రాల ఇంచార్జిల‌తో కీల‌క స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌నుంది. ఆ స‌మావేశానికి ఆర్గ‌నైజ‌ర్ వేణుగోపాల్ అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్నాడు. సంస్థాగ‌త ఎన్నిక‌లు, స‌భ్య‌త్వ డ్రైవ్‌, ఆందోళ‌న ప్ర‌ణాళిక ఎజెండా ఆ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఐదు రాష్ట్రాల ఫ‌లితాల త‌రువాత జ‌రుగుతోన్న కీల‌క స‌మావేశంగా కాంగ్రెస్ చెబుతోంది. సంస్థాగ‌త మార్పుల గురించి ఈ స‌మావేశంలో ప్ర‌స్తావించే అవ‌కాశం ఉంది.
ఇప్ప‌టికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్లు ఢిల్లీకి చేరుకున్న విష‌యం విదిత‌మే. పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేయ‌డానికి సిద్ధం అయ్యారు. రెండు రోజులుగా అక్క‌డే సోనియా అపాయిట్మెంట్ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే, ఏఐసీసీ కార్యాల‌యంలోని కీల‌క లీడ‌ర్ల‌తో మాత్ర‌మే వాళ్లు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని తెలుస్తోంది. శ‌నివారం జ‌రిగే కీల‌క స‌మావేశంలోపు సోనియా, రాహుల్ ను క‌ల‌వాల‌ని సీనియ‌ర్లు ప్ర‌య‌త్నిస్తున్నారు.
క్షేత్ర స్థాయి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత మార్పులు అవ‌స‌ర‌మ‌ని ఇటీవ‌ల సోనియాను క‌లిసిన జీ 23 నేత‌లు సూచించారు. అంతర్గత సంస్కరణలను వేగంగా తీసుకెళ్లాల‌ని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పార్టీలో తీవ్రమవుతున్న విభేదాలను పరిష్కరించే దిశ‌గా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ క్ర‌మంలోనే జి23 నేతలు ఆనంద్ శర్మ, మనీష్ తివారీ, వివేక్ తంఖాలతో సోనియా మంగ‌ళ‌వారం భేటీ అయిన విష‌యం విదిత‌మే.
సంస్థాగత మార్పుల కోసం జి-23 నేతలు ఒత్తిడి చేస్తుండగా, ఆగస్టు-సెప్టెంబర్ ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సోనియా గాంధీ వాళ్ల‌కు హామీ ఇచ్చార‌ని తెలిసింది. ఇటీవల ఎన్నికలకు వెళ్లిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ గోవా, మణిపూర్ మరియు పంజాబ్ ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని కాంగ్రెస్ చవిచూసింది. ఆ ఫ‌లితాల‌ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేయ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆ క్ర‌మంలో శ‌నివారం కీల‌క స‌మావేశం ఢిల్లీలో జ‌ర‌గ‌బోతుంది.