Harish Rao: కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు రైతుల పాలిట శత్రువులు : మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు రైతుల పాలిట శత్రువులని తెలంగాణ మంత్రి హరీశ్ రావు జాతీయ పార్టీలపై విరుచుకుపడ్డారు.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 01:45 PM IST

Harish Rao: కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు రైతుల పాలిట శత్రువులని తెలంగాణ మంత్రి హరీశ్ రావు జాతీయ పార్టీలపై విరుచుకుపడ్డారు. బుధవారం సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని సీతారామన్‌పై మండిపడ్డారు. బీజేపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం రూ.100 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. జీఎస్‌డీపీకి తెలంగాణ అప్పులు 28 శాతం మాత్రమేనని, బీజేపీ పాలిత కేంద్రం జీడీపీలో 57 శాతం అప్పులు ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి అన్నారు. కనీస అప్పులు ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ దిగువ నుంచి ఆరో స్థానంలో ఉందని పేర్కొన్నారు. రూపాయి విలువ క్షీణతకు, దేశంలో అత్యధిక నిరుద్యోగిత రేటుకు బీజేపీయే కారణమని హరీశ్ రావు ఆరోపించారు.

బీజేపీ హయాంలోనే వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1,200కి పెరిగిందన్నారు. ”కాంగ్రెస్‌, భాజపాలు రైతుల పాలిట శత్రువులు. ఆ విషయం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలతో తెలిసిపోయింది. స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయకుండా అడ్డుకున్నది కాంగ్రెస్‌ పార్టీ. మేము అధికారంలోకి వస్తే ఆ సిఫార్సులను అమలు చేస్తామని బీజేపీ కేంద్రంలో గద్దెనెక్కింది. ఆ రెండు పార్టీలు ఆ హామీని అమలు చేయలేదు. దాంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది” అని అన్నారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామని కేంద్రం చెప్పినా కేసీఆర్‌ అంగీకరించలేదని, 60 లక్షల మంది రైతుల ప్రయోజనాలు ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నారని, అందుకోసం రూ.25వేల కోట్లు వదులుకున్నారని అన్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు లేకుండా చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోందని హరీశ్‌ రావు ఆరోపించారు. రాజస్థాన్‌, హిమాచల్, కర్ణాటక వంటి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు కూడా మీటర్లు పెట్టడానికి అంగీకరించి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నాయని, పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణలో కూడా మోటార్లకు మీటర్లు వస్తాయన్నారు.