TPCC : హింసాత్మ‌కంగా టీకాంగ్రెస్ రాజ్ భ‌వ‌న్ ముట్ట‌డి.. నేత‌ల‌పై కేసులు న‌మోదు

  • Written By:
  • Publish Date - June 16, 2022 / 09:11 PM IST

గురువారం రాజ్‌భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. రాజ్‌భవన్‌కు వెళ్లే మార్గాలను పోలీసులు అడ్డుకోవడంతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. వారిని శాంతింపజేసి దారి తీయడానికి ప్రయత్నించిన పోలీసులతో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగడం నిరసనలు కనిపించాయి. కాంగ్రెస్‌ నాయకురాలు రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎస్ ఐ కాల‌ర్‌ పట్టుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క, గీతారెడ్డి తదితర నేతలను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీని ఇడి వేధింపులకు గురిచేస్తోందనినిరసిస్తూ రాజ్‌భవన్‌ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) పిలుపు మేరకు రాజ్‌భవన్‌ పరిసరాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌ చుట్టూ ఆందోళనకారులు గుమికూడకుండా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. పంజాగుట్టలోని రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే రాజ్‌భవన్‌ వద్ద ర్యాలీకి, నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు అక్కడికి చేరుకోకుండా రాజ్‌భవన్‌ వైపు వెళ్లే రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిర‌స‌న‌లో పాల్గొన్న వారిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ప్ర‌భుత్వ‌, ప్ర‌వేట్ ఆస్తులు ధ్వ‌సం చేసినందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టితో పాటు ప‌లువురి నేత‌ల‌పై కేసులు న‌మోదు చేశారు.