తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోపై గత నెలరోజులుగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. 317 జీవోలో సవరణలు చేయాలని ఉపాధ్యాయులు ప్రగతి భవన్‌ను ముట్టడికి ప్రయత్నించారు. దీంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముట్టడికి వచ్చిన వందకుపైగా టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం చిందరవందరగా ఉద్యోగుల బదిలీలు చేపట్టారని, సీనియార్టీ ప్రకారం కేటాయింపు జరగలేదని, 317 జీవోతో భార్య భర్తలను విడదీస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఉద్యోగులను వేరే చోటుకు బదిలీ చేయడం అన్యాయమని, ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీచర్లు ఆరోపిస్తున్నారు. 317 జీవో రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదని తెలిపారు.
టీచర్ల అరెస్ట్ పై కాంగ్రెస్ చీఫ్ రేవంత్ మండిపడ్డారు. ఉపాధ్యాయులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన పోరాటం చేశారని, అలాంటి ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం గొంతెత్తితే అరెస్ట్ చేయడం దారుణమని రేవంత్ పేర్కొన్నారు. ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టె 317జీవోను ప్రభుత్వం రద్దుచేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. టీచర్ల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రేవంత్ తెలిపారు.