ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా వివాహేతర సంబంధాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. భార్యాభర్తలు వివాహిత సంబంధాల మోజులో పడి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ వివాహేతర సంబంధాల సంఖ్యను తగ్గించడం కోసం తాజాగా ఒక కంపెనీ వింత ఆదేశాలను జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలోని ఓ కంపెనీ వింత ఆదేశాలు జారీ చేసింది. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులెవరూ వివాహేతర సంబంధాలు పెట్టుకోవద్దు అన్న నిబంధనను విధించింది.
అలాగే విడాకులు కూడా ఇవ్వొద్దని తెలిపింది. వీటిని అతిక్రమించిన వారిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని తెలిపింది. ఈ ఆదేశాలను కంపెనీ జూన్ 9న జారీ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే, తాజాగా ఈ నిబంధనపై చైనాలోని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. కంపెనీ అంతర్గత నిర్వహణను మెరుగుపర్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కుటుంబానికి విశ్వాసంగా ఉండడం, దంపతుల మధ్య మంచి అనుబంధాన్ని నెలకొల్పే సంస్కృతిని బలోపేతం చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటేనే ఉద్యోగుల పనితీరు కూడా బాగుంటుందని భావించే ఈ నిబంధనను రూపొందించినట్లు తెలిపారు. కాగా దీనిపై చైనా సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై నిబంధనలను రూపొందించడం సరికాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇలాంటి నిబంధనల వల్ల కుటుంబ విలువలు నిలబడతాయనే వాదన కూడా కొంతమంది నుంచి వినిపిస్తోంది. షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న వీఅండ్‌టీ లా సంస్థకు ఓ లాయర్ మాత్రం న్యాయపరంగా ఈ నిబంధన సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఓ ఉద్యోగిని తొలగించడానికి అతని పనితీరు ఆధారిత కారణాలు మాత్రమే న్యాయస్థానంలో చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేశారు.