Hydra : హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కాముని చెరువు, మైసమ్మ చెరువులను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని స్పష్టం చేశారు. గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్నవాటి వైపు వెళ్లం అన్నారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదని పేర్కొన్నారు. జులై తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని వెల్లడించారు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా తనిఖీలు చేస్తుంది. పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి హైడ్రా రాదు అని వ్యాఖ్యానించారు. అంతేకాక..పేదల ఇళ్లు హైడ్రా కూల్చివేస్తుందనే తప్పుడు ప్రచారం నమ్మొద్దుని రంగనాథ్ అన్నారు.
హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లం, జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదు కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుంది- కమిషనర్ రంగనాథ్ pic.twitter.com/s7mVfpKMGp
— Hashtag U (@HashtaguIn) December 17, 2024
కాముని చెరువులో నిర్మాణ వ్యర్థాలతో పాటు మట్టిని నింపి కొంతమంది ఆక్రమిస్తున్నారని, చెరువులకు అనుసంధానంగా వుండే కాలువల కబ్జాపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కమిషనర్ మంగళవారం క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు. కాముని చెరువులో మట్టిపోసినవారిని వదిలిపెట్టేది లేదని, చెరువులో నిర్మాణాలు చేపడితే కూల్చి వేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. చెరువు కాబ్జాపై స్థానికులు సంఘటితమై ఫిర్యాదు చేయడమే కాకుండా చెరువును కాపాడడంలో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తాం అని చెప్పడం చాలా శుభ పరిణామం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు.
అనంతరం మైసమ్మ చెరువు పరిసరాలను కమిషనర్ పరిశీలించారు. కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువుకు వచ్చే వరద కాలువ పనులు పూర్తి చేయకుండా అక్కడ వాసవి నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 మీటర్ల వెడల్పుతో నిర్మించ తలపెట్టిన వరద కాలువను పూర్తి స్థాయిలో వెంటనే నిర్మించాలని నిర్మాణ సంస్థకు సూచించారు. వరద కాలువను మళ్లించడం వల్ల దిగువన వున్న సఫ్దార్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ బస్తీలు వర్షా కాలంలో మునిగిపోయాయని స్థానికులు కమిషనర్ కు ఫిర్యాదు చేసారు. వచ్చే వర్షా కాలనికి ఆ యిబ్బంది లేకుండా కాముని చెరువు, మైసమ్మ చెరువుల మధ్య వున్న వరద కాలువ నిర్మాణ పనులను పూర్తి చేసేలా చూడాలని స్థానిక అధికారులను కమిషనర్ ఆదేశించారు.
కాగా, హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివస్తున్న విషయం తెలిసిందే. అయితే హైడ్రా కూల్చివేతలపై కొంతమంది సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లింది. మరోవైపు హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలసిందే. తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో హైడ్రాకు ప్రత్యేక కార్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే కార్యాలయానికి సిబ్బందిని సైతం కేటాయించింది. అలాగే పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో కీలక ఉన్నతాధికారులను నైతం ఈ హైడ్రాలో విధులు కేటాయించింది.
Read Also: India Saved Follow-On: టీమిండియా పరువు కాపాడిన బౌలర్లు.. తప్పిన ఫాలోఆన్!