Site icon HashtagU Telugu

CM Revanth Reddy: కారుణ్య నియామ‌క పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎప్పుడంటే?

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పంచాయతీ రాజ్ శాఖలో జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తులు, పంచాయతీ రాజ్ శాఖలోని పాఠశాలల్లో పనిచేస్తున్న‌ ఉద్యోగులు సర్వీసులో ఉండగా అకాల మరణం చెందారు. కానీ వారి మీద ఆధారపడిన వారసులకు గత పది సంవత్సరాలుగా కారుణ్య నియామకాలు చేప‌ట్ట లేదు. తగిన సమయములో కారుణ్య నియామకాలు జరగనందున, సంపాదించే కుటుంబ పెద్ద మరణించినందున ఆ కుటుంబాలు తీవ్రమైన ఆర్ధిక, మానసిక ఇబ్బందులకు గురైయ్యాయి.

ఇతర శాఖలలో వెంటనే కారుణ్య నియామకాలు జ‌రిగినా.. పంచాయతీ రాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా లేవ‌నే కార‌ణంతో కారుణ్య నియామకాలను గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. తమకు వెంటనే కారుణ్య నియామకాలు కల్పించాలని ఆయా కుటుంబాలు ప్రభుత్వానికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసిన గ‌త ప్ర‌భుత్వం పెడ చెవిన పెట్టింది. అయితే వారి ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని వారి నియామ‌కం ప‌ట్ల సానుకూలంగా వ్య‌వ‌హ‌రించారు పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీత‌క్క.

Also Read: IPL Opening Ceremony: ఐపీఎల్ ప్రారంభ వేడుక‌లు.. 13 స్టేడియాల్లో రంగం సిద్ధం!

సీత‌క్క ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవ‌డంతో నిరీక్ష‌ణ‌కు తెర‌

పంచాయ‌తీ రాజ్ విభాగంలో 582 సూపర్ న్యూమరరీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేసేలా ప్ర‌భుత్వాన్ని సీత‌క్క ఒప్పించారు. దీంతో ఎప్పుడూ లేని విధముగా 582 సూపర్ న్యూమరరీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్ర‌భుత్వం మంజూరు చేయ‌డంతో కారుణ్య నియ‌మాకాల‌కు మార్గం సుగుమమైంది. 582 కారుణ్య నియామ‌కాల‌తో పాటు, మిషన్ భగీరథ శాఖలో 55 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 27 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో 38 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 55 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీత‌క్క అందజేయనున్నారు. కారుణ్య నియామ‌కాల‌కు అనుమ‌తులిచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మ‌ల్లు బ‌ట్టి విక్ర‌మార్క‌కు సీత‌క్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.