Foreign Tour : సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్, స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్.. ఇవాళ రాత్రి 10 గంటలకు సింగపూర్‌కు పయనమవుతారు. ఈ నెల 17 నుంచి 20 వరకు నాలుగు రోజులపాటు అక్కడ గడపనున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఏర్పాటైన క్రీడా విశ్వవిద్యాలయాలు, స్టేడియాలను పరిశీలించనున్నారు. అంతేకాదు అక్కడి అధికారులతో సమావేశం కానున్నారు. ఈక్రమంలోనే పలువురు పారిశ్రామికవేత్తలతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నట్టు అధికారులు తెలిపారు.
అక్కడి నుంచి ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్లనున్న సీఎం బృందం దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని, ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసంతో ఉన్నారు. ఈ నెల 21న ఉదయం స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయం చేరుకొని దావోస్ వెళ్తారు. దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరంలో సీఎం బృందం పాల్గొననుంది. దేశ, విదేశాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు సదస్సుకు హాజరు కానున్నారు. పారిశ్రామికవేత్తలతో రాష్ట్రానికి పెట్టుబడులపై చర్చించి ఒప్పందాలు చేసుకోనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు సింగపూర్, స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు.
కాగా, ఈసారి దావోస్ సమావేశాల్లో రూ. 50 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. భారత్‌లో పెట్టుబడులకు సిద్ధమవుతున్న విదేశీ కంపెనీలు తెలంగాణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంగా ఈసారి దావోస్ సమావేశంలో తెలంగాణ పెవిలియన్ పేరుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. దావోస్ పర్యటన అనంతరం ఈ నెల 24న సీఎం హైదరాబాద్ చేరుకోనున్నారు.
Read Also: Saif Ali Khans Empire: సైఫ్ అలీఖాన్‌కు ఎన్నెన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో తెలుసా ?