Ponnala: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని ఆయన ప్రశ్నించారు. సన్న బియ్యం పంటకు మాత్రమే బోనస్ 500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఎన్నికల ముందు వరి పంటకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రైతులకు చెప్పిందని, ఎన్నికల కోడ్ వుండగానే సీఎం రేవంత్ రెడ్డి బోనస్ ఇస్తామని చెప్పారని అన్నారు.
‘‘ఓట్లు దండుకోవడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. తడిసిన ధాన్యం వద్దకు ఇప్పటి వరకు కాంగ్రెస్ మంత్రులు వెళ్ళలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి ఇతర రాష్ట్రాలకు మంత్రులు వెళ్తున్నారు. తడిసిన వడ్లను ఇప్పటి వరకు ఒక్క కేజీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. అధికారంలోకి వస్తే రైతు బంధు 15 వేలు ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు 12 వేలు ఇస్తామన్న అంశంపై క్యాబినెట్ మీటింగ్ లో చర్చ జరిగిందా…?’’ అని పొన్నాల ప్రశ్నించారు.
‘‘తమ అవసరాల కోసమే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం
రైతుల గొంతు కోసింది. కాంగ్రెస్ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులతో పతనం తప్పదు. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మోసం చేస్తే బండకేసి కొట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు. రైతుబంధు ఎప్పుడు ఇవ్వాలో ప్రభుత్వానికి తెలియడం లేదు’’ అని పొన్నాల ఫైర్ అయ్యారు.