Deepotsav: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కర్తవ్య పథ్ (గతంలో రాజ్‌పథ్) ప్రాంతం మొట్టమొదటిసారిగా దీపావళి సందర్భంగా అద్భుతమైన దీపోత్సవ కాంతులతో (Deepotsav) వెలిగిపోయింది. ఢిల్లీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేఖ గుప్తా పాల్గొన్నారు. ఈ దీపోత్సవం ప్రత్యేకత ఏమిటంటే.. కర్తవ్య పథ్ పొడవునా రికార్డు స్థాయిలో 1.51 లక్షల దీపాలను వెలిగించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని ద్విగుణీకృతం చేసింది.
ముఖ్యమంత్రి రేఖ గుప్తా మంత్రులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి దీపాలు వెలిగించడం ద్వారా ఈ దీపోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా ఆకాశంలో అద్భుతమైన డ్రోన్ షోలు నిర్వహించారు. డ్రోన్‌లు ఆకాశంలో దీపాల కాంతులతో వివిధ ఆకృతులను, సందేశాలను ప్రదర్శించడం చూపరులను మంత్రముగ్ధులను చేసింది.
Also Read: Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు
దీంతో పాటు వేదికపై రామకథా ప్రదర్శన, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలు భారతీయ పురాణ చరిత్ర, కళా రూపాల గొప్పతనాన్ని చాటిచెప్పాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా మాట్లాడుతూ.. కర్తవ్య పథ్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ దీపోత్సవం ప్రజలకు ఆనందాన్ని, సాంస్కృతిక అనుభూతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పండుగల ఉత్సవాలను మరింత గొప్పగా జరపాలనే ప్రభుత్వ సంకల్పానికి ఈ కార్యక్రమం నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఈ దీపోత్సవం ఢిల్లీ ప్రజలకు, పర్యాటకులకు చిరస్మరణీయమైన అనుభూతిని ఇచ్చింది.