KCR Speech: ఆగం చేయ‌కండి ప్లీజ్‌: మునుగోడు స‌భ‌లో కేసీఆర్ అభ్యర్థ‌న‌

వ్య‌వ‌సాయ మోట‌ర్ల‌కు మీట‌ర్లు పెడ‌తామ‌న్న బీజేపీ కావాలా?

  • Written By:
  • Updated On - August 21, 2022 / 12:12 AM IST

వ్య‌వ‌సాయ మోట‌ర్ల‌కు మీట‌ర్లు పెడ‌తామ‌న్న బీజేపీ కావాలా? రైతు బంధు ఇస్తోన్న టీఆర్ఎస్ కు ఓటేస్తారా? ఆలోచించ‌డ‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ అభ్య‌ర్థించారు. ఒక వేళ మునుగోడులో బీజేపీని గెలిపిస్తే మోటార్ల‌కు మీట‌ర్లు బిగించ‌డానికి అంగీక‌రించిన‌ట్టు అవుతుంద‌ని అన్నారు. మోడీ స‌ర్కార్ ను ఢీ కొడుతోన్న కేసీఆర్ ను మీరే ఆగం చేస్తే ఎలా? అంటూ ప్ర‌శ్నించారు. కేంద్రం ప్ర‌భుత్వం, ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ గా చేసుకుని ఆద్యంత‌మూ మునుగోడు స‌భ ప్ర‌సంగం జ‌రిగింది. మునుగోడు గోల్ మాల్ ఎన్నికంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.

*న‌రేంద్ర మోడీ అహంకారం ఆయ‌న్ను గ‌ద్దె తించుతుంది. ఆయ‌న పాల‌న‌లో మ‌త‌, కుల చిచ్చు పెంచుతున్నారు. రైతుల‌ను బ‌త‌క‌నివ్వ‌డంలేదు. పండిన పంట‌ను కొనుగోలు చేయ‌డంలేదు. బీజేపీ. మీట‌ర్ పెట్టాలి. విద్యుత్ ను తెలంగాణ‌కు లేకుండా చేయాల‌ని బీజేపీ చూస్తోంది. ఈ ఎన్నిక రైతు, కార్మికుల బ‌తుకు ఎన్నిక‌. జాగ్ర‌త్త‌గా ఆలోచించి ఓటు వేయాలి.

*చేతిలో ఉండే ఒకే ఒక్క ఆయుధం ఓటు అని.. దాని ద్వారా మనకు ఉపయోగపడేది ఏమిటని గుర్తుంచుకుని ఓటు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. మునుగోడులో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘జై తెలంగాణ’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నిక రావడం వెనుక ఉన్న ఉద్దేశమేమిటో ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు.

*ఇక్కడ గోల్ మాల్ చేసి ఉప ఎన్నిక వచ్చేలా చేశారు. ఇంకో ఏడాదిలోనే ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక తేవాల్సిన అవసరం ఏమిటి? మిమ్మల్ని ఇలా ఎర్రటి ఎండలో నిలబెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? దీని వెనుకాల మాయా మశ్చీంద్ర ఏమిటి? గుర్తించకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అని కేసీఆర్ చెప్పారు.

*మొన్న సీపీఎం, సీపీఐ నాయకులతో ఒకే మాట చెప్పాను. మనమంతా విడిపోయి ఉండొద్దు. ఐక్యంగా ఉండాలి. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రగతిశీల, క్రియాశీల శక్తులన్నీ ఏకం కావాలి, ఈ దుర్మార్గులను సాగనంపాలి. అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది, దేశం బాగుపడుతుందని అభిప్రాయాలను పంచుకున్నాం. చిన్న చిన్న అంశాలను పక్కనపెడితే.. దేశం జీవికనే దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపించడమే సరైనదని నిర్ణయించి సీపీఐ వారు మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ తరఫున సీపీఐకి ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని కేసీఆర్ పేర్కొన్నారు.

*కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఎనిమిదేళ్లు అయిందని.. ఇప్పటికీ కృష్ణా నదిలో నీటి వాటా తేల్చకుండా తాత్సారం చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నీటి వాటాలు ఎందుకు తేల్చడం లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వ విధానం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరుపై పోరాడుతామన్నారు. పోరాటాలు తెలంగాణకు కొత్త కాదని.. కొట్లాడటం మొదలుపెడితే ఎక్కడిదాకా అయినా వస్తామని వ్యాఖ్యానించారు. మనుగోడు బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.

*దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను, సమాజాన్ని విభజించే విద్వేష విధానాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్చిస్తున్నాం. దేశాన్ని, ప్రజలను ఎలా కాపాడుకోవాలనే దానిపై ఐదారు నెలలుగా తలలు బద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితులతో దేశం యొక్క జీవిక దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రగతిశీల, క్రియాశీల శక్తులు ఏకం కావాలని నిర్ణయించుకున్నాం. పేదలు, రైతుల బతుకులు బాగుపడేదాకా పోరాడుతాం. దేశంలో ప్రగతిశీల శక్తులన్నింటినీ ఒకటి చేసి పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటం ఒక్క రోజుతో ఆగేది కాదు. ఈ ఉప ఎన్నికకే పరిమితం కాదు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్ సహా మిగతా క్రియాశీల శక్తులన్నీ కలిసి పోరాడుతాం.” అని కేసీఆర్ పేర్కొన్నారు.

*తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఎనిమిదేళ్లు అయింది. కృష్ణా నదిలో నీటి వాటా తేల్చాలని కోరితే ప్రధాని నరేంద్ర మోదీ తేల్చడం లేదు. ఎందుకు తేల్చడం లేదు? ఇప్పుడు మునుగోడుకు ఎందుకు వస్తున్నారు. మా నీటి వాటా మాకు ఇవ్వనందుకే అమిత్ షా తెలంగాణకు వస్తున్నారా? బిడ్డా.. అమిత్ షా సమాధానం చెప్పాలి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకపోవడానికి కారణమేంటో చెప్పాలి. మా నీటి వాటా తేల్చితే అందుకు అనుగుణంగా ప్రాజెక్టులను పూర్తిచేసుకుంటాం. కానీ తేల్చకుండా అడ్డం ఎందుకు పడుతున్నారు?” అని కేసీఆర్ ప్రశ్నించారు.

*పంద్రాగస్టు నాడు ప్రధాన మంత్రి మాట్లాడితే మైకులు పగలిపోయాయి. అందులో ఒక్క మాట అయినా మంచి మాట ఉందా? బీజేపీ నేతలుగానీ, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిగానీ, రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తిగానీ ఢిల్లీ వెళ్లి.. తెలంగాణకు కృష్ణా నీటి వాటా తేల్చడం లేదేమని అడగగలరా? లేదు. కానీ రేపు డోలు, బాజాలు పట్టుకుని అమిత్ షాను మునుగోడుకు తీసుకొస్తారట. నేను కేంద్ర హోం మంత్రిని డిమాండ్ చేస్తున్నా. మీరు కృష్ణా జలాల వాటా ఎందుకు తేల్చడం లేదు? ఈ విషయంలో మీ కేంద్ర ప్రభుత్వ విధానం ఏమిటో సమాధానం చెప్పాలి. మీ దద్దమ్మ, చేతగానితనం ఏమిటో రేపు మునుగోడు సభలో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా..” అని కేసీఆర్ మండిపడ్డారు.

మునుగోడు స‌భ‌లో క‌మ్యూనిస్ట్ ల‌ను అక్కును చేర్చుకున్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఆ పార్టీకి ఓటేస్తే వ్య‌ర్థ‌మ‌ని వ్యాఖ్యానించారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ లేని పార్టీకి ఓటేయ‌డం వ‌ల‌న ఒరిగేది ఏమీ లేద‌ని తేల్చారు. అదే సంద‌ర్భంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను నిల‌దీశారు. శ్రైశైలం నీటి వాటాను మునుగోడు స‌భ‌లో తేల్చాల‌ని కేసీఆర్ డిమాండ్ చేశారు.

గ‌జ‌క‌ర్ణ‌గోక‌ర్ణ విద్య‌ల‌తో మోసం చేయ‌డానికి బీజేపీ వ‌స్తుంద‌ని కేసీఆర్ ఆరోపించారు. వాళ్ల మాట‌లు న‌మ్మి మోస‌పోకండ‌ని పిలుపునిచ్చారు. కేంద్ర స‌ర్కార్ ను ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌సంగించిన కేసీఆర్ రాబోవు రోజుల్లో మునుగోడులో వ‌చ్చే ఫ‌లితం ఆధారంగా దేశ రాజ‌కీయాల‌పై ప్ర‌భావం ఉంటుంద‌న్న సంకేతాలను ఇచ్చారు. అందుకే, అంద‌రూ చ‌ర్చించుకుని ఆగం కాకుండా ఓట్లు వేయాల‌ని పిలుపు నిచ్చారు.

మునుగోడు స‌భ‌లో అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తార‌ని భావించిన టీఆర్ఎస్ శ్రేణుల‌కు కేసీఆర్ నిరాశ మిగిల్చారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ప్ర‌భాక‌ర్ రెడ్డిని అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని అనుకున్నారు. కానీ, వ్యూహాత్మ‌కంగా కేసీఆర్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌కుండా ప్ర‌సంగాన్ని ముగించారు. బ‌హుశా కాంగ్రెస్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన త‌రువాత టీఆర్ఎస్ ప్ర‌క‌టించే అవకాశం ఉంద‌ని టీఆర్ఎస్ పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.