Site icon HashtagU Telugu

KCR Warns Kavitha: తలపోటు వ్యవహరాల్లో తలదూర్చొద్దు!

Kcr

Kcr

ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ వ్యవహరంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత హస్తమున్నట్టు మీడియాలో కథనాలు రావడం, బీజేపీ నేతలు తీవ్రంగా ఆరోపించడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. కవిత వ్యవహరంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ‘‘ఇదంతా బీజేపీ కుట్ర’’ అంటూ కవితకు మద్దుతగా తెలుపగా, సీఎం కేసీఆర్ మాత్రం కవిత తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలాంటి తలపోటు వ్యవహరాల్లో తలదూర్చొద్దు అని సున్నితంగా మందలించినట్టు తెలుస్తోంది.

దేశ రాజధానికి కొత్త మద్యం పాలసీని అమలు చేయడంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిసోడియాతో పాటు హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై సహా ఇతరులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది. దేశ రాజధానిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సర్సా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “ఒబెరాయ్ హోటల్‌లో సమావేశాల్లో కవిత పాల్గొంది. దక్షిణాది నుండి మద్యం వ్యాపారులను తీసుకువచ్చింది. మాగుంట కుటుంబ సభ్యుల పేరుతో మద్యం లైసెన్సుల కోసం ముందుగా డబ్బులు చెల్లించారు. పంజాబ్, గోవా ఎన్నికలకు కూడా ముందుగానే డబ్బులు ఇచ్చారు’’ అని ఆరోపించారు.

కాగా ఢిల్లీ స్కామ్ కథనాలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ’’దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికపక్ష పార్టీల మీద అధికారిక బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదు. నిరాధారంగా మాట్లాడటం ఆరోగ్యకరమైన పద్దతి కాదు. కేసిఆర్ బిడ్డను బద్నాం చేస్తే, కేసీఆర్ ఆగమైతడని, కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్న కేసీఆర్ భయపడుతారేమో అని, బీజేపీ నేతలు ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని కవిత క్లారిటీ ఇవ్వగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఇతర నేతలు మాత్రం.. ‘మద్యం పాలసీ కోసమే’ కేసీఆర్ ఫ్యామిలీ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని ఆరోపించడం గమనించదగ్గ విషయం.