CPI Supports To TRS: టీఆర్ఎస్ కు జై కొట్టిన ‘సీపీఐ’

టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శుక్రవారం సీపీఐ నేతలతో చర్చించారు.

  • Written By:
  • Updated On - August 21, 2022 / 12:14 AM IST

టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శుక్రవారం సీపీఐ నేతలతో చర్చించారు. సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డిలతో కేసీఆర్ శుక్రవారం రాత్రి సుమారు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని కేసీఆర్ వారిని అభ్యర్థించగా తెలంగాణలోని అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తమ మద్దతు ఉంటుందని హమీ ఇచ్చినట్టు తెలుస్తోంది! మునుగోడులో బహిరంగ సభకు హాజరుకావాలని సీఎం కోరగా సీపీఐ నేతలు అంగీకరించారు. ఈ నేపథ్యంలో మునుగోడు టీఆర్‌ఎస్‌ సభకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి హాజరుకానున్నారు.

శనివారం సీఎంతో చర్చించిన అంశాలపై సీపీఐ నేతలు సమీక్షించి, మధ్యాహ్నం ప్రెస్‌మీట్‌లో తమ నిర్ణయాన్ని ప్రకటించారు. భవిష్యత్తులోనూ టీఆర్ఎస్‌తో కలిసి పోరాడాలని నిర్ణయించామని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగా పోటీచేసే పరిస్థితి లేదన్నారు. బీజేపీని ఓడించాలని జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని చాడ వెంకటరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

తెలంగాణలో కమ్యూనిస్టుల ప్రభావం కొంతమేర తగ్గినా మునుగోడు నియోజకవర్గంలో మాత్రం అక్కడక్కడ బలంగానే ఉంది. ఈ ఉప ఎన్నికలో కమ్యూనిస్టుల ఓట్లు కీలకం కావడంతో అన్ని పార్టీలు ఎర్ర పార్టీల వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ముందస్తుగా సీపీఐ నేతలతో చర్చలు జరిపారు. సీపీఐ మద్దతు కూడగట్టడంలో సీఎం కేసీఆర్ సక్సెస్ అయ్యారు.