CM KCR: ఢిల్లీకి మళ్లీ కేసీఆర్.. బీజేపీపై యుద్ధం!

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా మారిన బీజేపీని ఎదుర్కోవడానికి ఢిల్లీలో పావులు కదుపుతున్నారు కేసీఆర్. అందుకే దేశ రాజధానికి మళ్లీ వెళ్లనున్నారు.

  • Written By:
  • Updated On - April 16, 2022 / 10:57 AM IST

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా మారిన బీజేపీని ఎదుర్కోవడానికి ఢిల్లీలో పావులు కదుపుతున్నారు కేసీఆర్. అందుకే దేశ రాజధానికి మళ్లీ వెళ్లనున్నారు. కేంద్రంలో బీజేపీపై యుద్ధం చేస్తానని ఆయన ఇటీవలే ప్రకటించారు కూడా. అందులో భాగంగానే.. ఈసారీ ఓ పదిరోజులు అక్కడే మకాం వేయనున్నారు. ఆ సమయంలోనే ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ కు కూడా వెళ్లే అవకాశం ఉంది. కేసీఆర్ అక్కడికి ఎందుకు వెళ్లనున్నారు అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. లఖింపూర్ లో ఆనాడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై హింసాకాండ జరిగింది. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఓ వాహనాన్ని ఆ రైతులపైకి ఎక్కించడంతో కొందరు రైతులతోపాటు ఓ జర్నలిస్ట్ కూడా మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

యూపీ ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనుకున్నారు. కానీ అక్కడ బీజేపీయే మళ్లీ అధికారంలోకి వచ్చింది. అనూహ్యంగా అదే లఖింపూర్ లో బీజేపీ అభ్యర్థి కూడా గెలవడంతో అసలక్కడ ఏం జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ అక్కడికి వెళ్లి రైతులను కలుస్తామని అనడం వెనుక ఉన్న రాజకీయ కారణాలు ఏమిటా అని బీజేపీ కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ ఏం చేసిన ఓ స్ట్రాటజీ ప్రకారమే చేస్తారన్న టాక్ ఉంది. అందుకే ఢిల్లీ పర్యటనను పూర్తిగా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఇదే నెల మూడో తేదీన కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. పంటి నొప్పి చికిత్స కోసమే ఆయన అక్కడికి వెళ్లారని చెప్పినా.. పదిరోజుల పాటు అక్కడే ఉన్నారు. తన టూర్ చివరిలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన దీక్షలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వడ్లను కొనుగోలు చేయాలన్న డిమాండ్ ను ఢిల్లీ వీధుల్లో వినిపించారు. మళ్లీ ఢిల్లీకి వస్తానని ఆయన అప్పుడే ప్రకటించారు కూడా. దీంతో ఆయన రెండో దఫా ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేపుతోంది.

ఈసారి ఢిల్లీ వెళ్లి అక్కడే ఉంటూ.. ఇతర ప్రాంతాల్లో పర్యటించడానికి… ఆర్థికవేత్తలు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటిగ్రేటెడ్‌ న్యూ అగ్రికల్చరల్‌ పాలసీ గురించి పూర్తిస్థాయిలో ప్రచారం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు దీనిపై జాతీయస్థాయి నిపుణులు, నాయకులతో హైదరాబాద్ లో వర్క్ షాప్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే లఖింపూర్ వెళ్లి వచ్చాక.. శరద్ పవార్ తో కూడా భేటీ అయ్యే ఛాన్సుంది. పుణె నగరానికి వెళ్లి అక్కడ కూడా కొంతమంది మేధావులు, నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికి కేసీఆర్ ఈసారి పూర్తిస్థాయి ప్రణాళికతోనే రంగంలోకి దిగారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.