Site icon HashtagU Telugu

CM KCR : గోదావ‌రి జలాలు తెచ్చి.. కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న పాదాలు కడిగాం – ‘కేసీఆర్

Kcr Mallanna Sagar

Kcr Mallanna Sagar

గోదావ‌రి జలాలు తెచ్చి కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న పాదాల‌ను క‌డుగుతామ‌ని చెప్పాం. చెప్పినట్లుగానే.. నేడు గోదావ‌రి జ‌లాల‌తో మల్లన్న పాదాలను అభిషేకం చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ జీవనాడి మల్లన్నసాగర్ అనీ, ఇది రాష్ట్ర ప్ర‘జల’ హృదయమని, మన ప్రాంతాన్ని జలాలతో అభిషేకం చేసే సాగరమని సీఎం పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టును బుధవారం సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత అక్క‌డే ఏర్పాటు చేసిన స‌భ‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టును ప్రారంభించుకోవ‌డం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంతోపాటు స‌స్య‌శ్యామ‌ల తెలంగాణ‌ను కూడా చూస్తుండటం మనందరికీ గర్వకారణమన్నారు. నూత‌న తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన అతి భారీ జ‌లాశ‌యం మల్ల‌న్న సాగ‌ర్‌ను ప్రారంభించుకోవ‌డం సంతోషకరమైన ఘ‌ట్టమని, ఈ మ‌హాయజ్ఞంలో ప్ర‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ సీఎం కేసీఆర్ ధ‌న్య‌వాదాలు తెలియజేశారు.కేవలం మూడేళ్ల కాలంలోనే నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టులో 58 వేల మంది కార్మికులు ప‌ని చేస్తున్నపుడు కొంద‌రు దుర్మార్గ‌మైన ప‌ద్ధ‌తుల్లో ప్ర‌గ‌తి నిరోధ‌క శ‌క్తులుగా మారి, దాదాపు 600 పైగా కేసులు వేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీర్లు రిటైరైనా కూడా ఈ ప్రాజెక్టు కోసం ప‌ని చేశారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నామన్నారు. ఎండ‌న‌క‌, వాన‌న‌క, రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ప‌ని చేశారని కొనియాడారు. భ‌యంక‌ర‌మైన క‌రువు నేల‌లో ప్ర‌జ‌లకు న్యాయం చేసేందుకు పోరాడామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎంతో మ‌న‌సు పెట్టి ముందుకు పోయామని, హ‌రీశ్‌రావు సేవ‌లు కూడా కాళేశ్వ‌రం ప్రాజెక్టులో ఉన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. భూములు కోల్పోయిన వారి త్యాగం వెల‌క‌ట్ట‌లేనిదని, ముంపున‌కు గురైన గ్రామాల‌ భూనిర్వాసితుల‌కు న్యాయం చేస్తామన్నారు. నిర్వాసితుల కోసం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి, మంజూరు చేయాలి. ఉపాధి క‌లిపించేలా చ‌ర్య‌లు తీసుకోవాలి అని మంత్రి హ‌రీశ్‌రావుకు, అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. మల్లన్నసాగర్ కేవలం సిద్దిపేట‌ జిల్లాకే కాకుండా హైద‌రాబాద్ న‌గ‌రానికి శాశ్వ‌తంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

Exit mobile version