CM KCR: గజ్వేల్ బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం

గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి చెందిన 20-25 మంది కార్యకర్తలతో కేసీఆర్ భేటీ కానున్నారు.

  • Written By:
  • Updated On - October 20, 2023 / 06:02 PM IST

CM KCR: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈసారి రెండుచోట్ల పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒకటి కామారెడ్డి కాగా, మరొకటి గజ్వేల్. అయితే సీఎం కేసీఆర్ మాత్రం రెండుచోట్ల గెలిపొంది ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పబ్లిక్ మీటింగ్స్ శ్రీకారం చుట్టిన అధినేత గెలుపు వ్యూహాలపై స్థానిక నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గజ్వేల్‌లో కేసీఆర్ వరుసగా రెండుసార్లు గెలిచారు. అయితే, ఈసారి మాత్రం అక్కడ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అక్కడి నుంచి మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా పోటీ చేస్తే కేసీఆర్ మెజార్టీ తగ్గే అవకాశాలున్నాయి. అయితే కేసీఆర్ స్థానిక నేతలకు అందుబాటులో ఉండకపోవడమే అక్కడ ఆయనపై వ్యతిరేకత పెరగడానికి కారణమని తెలుస్తోంది. దీంతో స్తానిక నేతల నుంచి కూడా కేసీఆర్‌పై వ్యతిరేకత కనిపిస్తోంది. వాళ్లంతా ఈసారి కేసీఆర్‌కు వ్యతిరేకంగా పని చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే కొందరు నేతలు ఈటల రాజేందర్‌తో సమావేశమైనట్లు తెలుస్తోంది. పైగా గజ్వేల్‌లో ముదిరాజ్ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గెలుపు అవకాశాలు తగ్గొచ్చు. అందుకే గజ్వేల్‌పై కూడా కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి చెందిన 20-25 మంది కార్యకర్తలతో కేసీఆర్ భేటీ కానున్నారు. వాళ్లందరితో మేడ్చల్ జిల్లా, ఆంతాయిపల్లి గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు కేసీఆర్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా తన గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. ఎట్టి పరిస్తితుల్లో ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా మెజార్టీతో గెలుపొందాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కామారెడ్డి నేతలతో భేటీ అయిన కేసీఆర్ గజ్వేల్  నేతలతో ప్రత్యేక సమావేశమయ్యారు. అయితే ఈసారి గజ్వేల్ బరిలో కీలక నేతలు రంగంలోకి దిగుతుండటంతో కేసీఆర్ మెజార్టీ తగ్గే అవకాశాలున్నాయని పలువురు భావిస్తున్నారు.