ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కడప, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఆయన కడప జిల్లాలో పర్యటిస్తారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతం అక్కడి నుంచి హెలికాప్టర్ లో కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ నిర్మించిన పుష్పగిరి కంటి ఆసుపత్రిని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. అనంతరం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరవుతారు జగన్.
మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 13 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 76 ఎస్ఐ లతో పాటు కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీకి చెందిన వారు బందోబస్తులో విధులు నిర్వర్తించనున్నారు. బందోబస్తు ఏర్పాట్లను కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ స్వయంగా పరిశీలించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సిబ్బందికి ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక కడపలో పర్యటన ముగించుకున్న తర్వాత విశాఖపట్నం బయలుదేరి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి జగన్.
కడప పర్యటన ముగుంచుకున్న అనంతరం సాయంత్రం 4.45 గంటలకు విశాఖకు వెళ్లనున్నారు సీఎం జగన్. ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ నేపథ్యంలో విశాఖకు వస్తున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు ఐఎన్‌ఎస్ డేగా వద్ద జగన్ స్వాగతం పలకనున్నారు. అక్కడ ఆ కార్యక్రమం ముగుంచుకున్న తర్వాత తిరిగి రాత్రి 7 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.