ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి , కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ఈ రోజు పోలవరం ప్రాజెక్టు, పునరావాస కాలనీలను పరిశీలించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు ఇందుకూరు-1 పోలవరం పునరావాస కాలనీకి కేంద్రమంత్రి షెకావత్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేరుకుని పోలవరం నిర్వాసితులతో మమేకమవుతారు. అనంతరం 11.20 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడ్వాయి పునరావాస శిబిరాన్ని సందర్శించి కాలనీవాసులతో మమేకమవుతారు.
అనంతరం 12.30 గంటలకు పోలవరం డ్యాం వద్దకు చేరుకుని ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలిస్తారు, అనంతరం సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. తొలుత పోలవరం ప్రాజెక్టు పురోగతిపై షెకావత్, ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఎగ్జిబిషన్ లో పాల్గొంటారు. అనంతరం పవర్‌హౌస్, లోయర్ కాఫర్‌డ్యామ్, గ్యాప్-II పనులు, రేడియల్ గేట్ పనులను పరిశీలిస్తారు.
కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరూ సాయంత్రం విజయవాడకు తిరిగి రానున్నారు. ప్రాజెక్ట్ కోసం సవరించిన అంచనాలను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు పదేపదే చేసిన విజ్ఞప్తిని అనుసరించి కేంద్ర మంత్రి పర్యటన జరిగింది. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రధాని మోదీని కలిశారు.