సామజిక, రాజకీయ, ఆర్థిక, మహిళా సంక్షేమానికి ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు ఒక కొత్త ఒరవడిని సృష్టించాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఎన్ని కుట్రలకు ప్రయత్నించినా ఈ సంక్షేమ యజ్ఞం ఆగదని సీఎం స్పష్టం చేశారు. ఈ మూడేళ్ళలోనే మహిళల ఖాతాల్లోకి వివిధ పథకాల కింద ఒక లక్షా 65 వేల కోట్ల రూపాయలు జమ చేశామని ఆయన వెల్లడించారు.
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈ రోజు కృష్ణాజిల్లా పెడన వేదికగా రాష్ట్రంలో 80వేల546 మంది చేనేత కార్మికులకు ‘నేతన్న నేస్తం’ నాల్గవ విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ఉదయం పెడన శివారు తోటమూల వద్దకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన చేనేత సొసైటీల స్టాల్స్ ను సందర్శించారు. నేతన్న నేస్తం ఆర్థిక సాయాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు జమ చేశారు.