ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలన్-2022 కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. నేవల్ డాక్‌యార్డులోని ఐఎన్‌ఎస్ విశాఖను సీఎం జాతికి అంకితం ఇచ్చారు. విశాఖ తూర్పు నావికా దళ కేంద్రంలో పర్యటించిన జగన్ నేవల్ డాక్ యార్డులో INS విశాఖ యుద్ధ నౌకను సందర్శించారు. ఈ క్రమంలో ఆర్కే బీచ్‌లోని ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలన్-2022 వేడుకలను ప్రారంభించిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ చరిత్రలో ఇవాళ గర్వించదగిన రోజని జగన్ అన్నారు.
ఈ ఉత్సవంలో 39 దేశాలు భాగస్వామ్యులయ్యాయని, భారతీయ నౌకాదళంలో తూర్పుతీర నౌకాదళ కేంద్రం ది సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం పాత్ర చిరస్మరణీయమైందని జగన్ తెలిపారు. విశాఖపట్నం పేరు మీద రూపొందించిన ఐఎన్‌ఎస్ విశాఖ యుద్ధనౌక భారతీయ యుద్ధనౌకల్లో కచ్చితంగా గర్వకారణంగా నిలుస్తుందని జగన్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఇది భిన్నమైన సామర్ధ్యం కలిగిన యుద్ధనౌక. ఐఎన్‌ఎస్ వేల జలాంతర్గామి దేశీయంగా జలాంతర్గామిలను రూపొందించడంలో మన శక్తి సామర్ధ్యాలను నిరూపించిందని జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ నేవీ కలిసి సంయుక్తంగా ఈ తరహా కార్యక్రమానికి విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించడం ఇదే తొలిసారి అని.. భవిష్యత్తులో కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని జగన్ పేర్కొన్నారు.