ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలి, మాట తీరు మారిపోయినట్లే అనిపిస్తున్నది. ఈ మధ్య సమీక్షలు, బహిరంగ సభల్లో ఆయన మాట్లాడే విధానం చూసి పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. మనకు ఎవరైన శత్రువులు, ప్రత్యర్థులు ఉంటే.. వాళ్ల గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే చులకన అవుతాము. అంతే కాకుండా ఎదుటి వాళ్లు ఒకటికి నాలుగు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన వాళ్లము అవుతాము. ఈ సీక్రెట్ వైఎస్ జగన్ కూడా తెలుసుకున్నట్లే అనిపిస్తున్నది. అందుకే ఇటీవల కాలంలో ఆయన మాటలు, ప్రసంగాల్లో చాలా తేడా కనిపిస్తోంది.
గతంలో బహిరంగ సభల్లో మాట్లాడే సమయంలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్రమైన విమర్శలు చేసేవారు. ప్రతీ సభలో టీడీపీ, చంద్రబాబుపై విమర్శలు గుప్పించేవారు. వైసీపీపై అసత్యాలు ప్రచారం చేసే మీడియాను తిట్టడమే కాకుండా.. పవన్ కల్యాణ్‌ను దత్త పుత్రుడు అంటూ ఎద్దేవా చేసేవారు. ఒకటి రెండు సభల్లో ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ కాస్త కటువుగానే జగన్ మాట్లాడేవారు. కానీ ఇటీవల రాజకీయ విమర్శలు చేయడం తగ్గించేసినట్లు జగన్ మాటతీరు గమనిస్తే తెలుస్తున్నది. సభ ఏదైనా ముందుగా చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీలను విమర్శించడమే ప్రధానంగా జగన్ ప్రసంగంలో కనపడేది.
కానీ ఇప్పుడు అలాంటి రాజకీయ విమర్శలు చేయడం లేదని ఆయన ప్రసంగాలు వింటే తెలిసిపోతుంది. నిన్న చీమకుర్తిలో జరిగిన సభలో వైఎస్ జగన్ రాజకీయ విమర్శలు చేయలేదు. ఒక్క మాట కూడా ప్రతిపక్షాల గురించి మాట్లాడలేదు. ఏదైనా సభ జరిగితే ప్రతిపక్షాలను తిడుతుంటే వైసీపీ కార్యకర్తలు ఉత్సాహంతో కేరింతలు కొడతారు. కానీ ఆ సభలో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం కార్యకర్తలను నిరుత్సాహానికి గురి చేయడమే కాకుండా ఆశ్చర్యం కూడా కలిగించింది.