ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. గౌతంరెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో మంత్రి గౌతంరెడ్డి అకాల మరణం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రగాఢం సంతాపాన్ని ప్రకటించారు. గౌతమ్ రెడ్డి మొదటి నుంచి తనకు చాలా సుపరిచితుడేనని అని తెలిపిన జగన్, ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
గౌతమ్ రెడ్డిని కోల్పోవడం తమ పార్టీకి తీరని లోటని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన క్యాబినేట్‌లో ఓ మంచి సహచరుడిని కోల్పోవడం, తనను తీవ్రంగా కలచి వేసిందని జగన్ అన్నారు. భారమైన హృదయంతో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు జగన్ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. మరోవైపు గౌతం రెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించగా, అక్కడికి, వైసీపీ నాయకులు,వైసీపీ కార్యకర్తలు, ఇతర పార్టీ నేతలు, ముఖ్యంగా బంధువులు భారీగా చేరుకుంటున్నారు.